అయిదేళ్లలో రూ.1,500 కోట్ల టర్నోవర్
►ఆగస్టుకల్లా చిత్తూరు ప్లాంటు సిద్ధం
►ఇక దేశవ్యాప్తంగా కాంటినెంటల్ కాఫీ
►సీసీఎల్ ఫౌండర్ చల్లా రాజేంద్ర ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్స్టాంట్ కాఫీ ఉత్పత్తిలో ప్రైవేట్ లేబుల్ విభాగంలో ప్రపంచ నంబర్ వన్‌గా ఉన్న సీసీఎల్ ప్రొడక్ట్స్ 2022 నాటికి రూ.1,500 కోట్లకుపైగా టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2016–17లో కంపెనీ రూ.984 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు దాటుతామని సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సొంత బ్రాండ్ అయిన కాంటినెంటల్ కాఫీ ఉత్పత్తుల విక్రయం ద్వారా భారత్‌లో అయిదేళ్లలో రూ.100 కోట్లు ఆర్జించాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు చెప్పారు. దేశీయ మార్కెట్ నుంచి ఆదాయం ప్రస్తుతం 5 శాతం ఉందని వివరించారు. ఇప్పటికే ప్రముఖ ఔట్లెట్లలో కాంటినెంటల్ కాఫీ విక్రయిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని దుకాణాల ద్వారా మార్కెట్ చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
సామర్థ్యం 50,000 టన్నులకు..: సీసీఎల్‌కు గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది. వియత్నాం ప్లాంటు సామర్థ్యం 10,000 టన్నులు. స్విట్జర్లాండు ప్లాంటులో విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రెండు మూడేళ్లలో వియత్నాం ప్లాంటు కెపాసిటీని రెట్టింపు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. యూనిట్లన్నీ పూర్తి స్థాయిలో నడుస్తుండడంతో కంపెనీ విస్తరణ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో నెలకొల్పుతున్న అత్యాధునిక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు 2018 ఆగస్టు నాటికి మొదలు కానున్నాయి. ఈ కేంద్రం వార్షిక సామర్థ్యం 5,000 టన్నులు. దీనికోసం కంపెనీ రూ.325 కోట్ల దాకా పెట్టుబడి పెడుతోంది. 50 శాతం బ్యాంకు రుణం ద్వారా, మిగిలిన 50 శాతం అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తోంది. 2022 కల్లా సీసీఎల్ తయారీ సామర్థ్యాన్ని 50,000 టన్నులకు చేరుస్తామని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇందుకు మరో ప్లాంటు అవసరమవుతుందని చెప్పారు.
ఉత్తర అమెరికాపై ఆశలు..
సీసీఎల్ ప్రస్తుతం 20 రకాల కాఫీ రుచులను తయారు చేస్తోంది. వీటిని సొంత బ్రాండ్‌తోపాటు 50 కంపెనీలకు 200లకుపైగా బ్రాండ్లలో సరఫరా చేస్తోంది. 80 కంటే ఎక్కువ దేశాల్లో ఇవి అమ్ముడవుతున్నాయి. ఆదాయంలో యూరప్ నుంచి 30 శాతం, జపాన్, ఆస్ట్రేలియా 30 శాతం, సీఐఎస్ దేశాల నుంచి 20 శాతం సమకూరుతోంది. ‘ఉత్తర అమెరికా వాటా ఇప్పుడు 4 శాతం మాత్రమే ఉంది. రానున్న రోజుల్లో చవక కాఫీ దిగుమతులకు యూఎస్ చెక్ పెట్టనుంది. ఈ చర్య సీసీఎల్‌కు కలిసి వస్తుంది. దీంతో వచ్చే అయిదేళ్లలో ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 20 శాతం టర్నోవర్ ఆశిస్తున్నాం. గ్రీన్ కాఫీ ధర ఆధారంగానే ఉత్పత్తుల ధర నిర్ణయిస్తున్నాం. దీనికి తగ్గట్టుగా కొనుగోలుదార్లతో ఒప్పందాలు ఉంటాయి. ముడి సరుకు ధర ఒడిదుడుకులకు లోనైనా సీసీఎల్‌పై ప్రభావం చూపదు’ అని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.