కంపెనీలు స్థాపించకుంటే భూములు వెనక్కి
మహేశ్వరం: టీఎస్ఐఐసీ ద్వారా పొందిన భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ స్థలాలను వెనక్కి తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ చంపాలాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని రావిర్యాల, కొంగరఖుర్దు, రాజీవ్ జేమ్స్పార్కు, గంగారం, నాగారం గ్రామాల్లోని ప్రభుత్వ భూములను పరిశిలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఐఐసీ ద్వారా తీసుకున్న భూముల్లో కంపెనీలు స్థాపించకుంటే ఆ భూములను వెనక్కి తీసుకొని ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రావిర్యాల రెవెన్యూ పరిధిలోని రాజీవ్ జేమ్స్పార్కులో ఖాళీగా ఉన్న భూములను పరిశీలించి కంపెనీలు ఎందుకు స్థాపించడం లేదంటూ జేమ్స్పార్కు అధికారులను ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం డైమండ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, అందుకే కొత్త కంపెనీలే స్థాపించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు.
మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు
రానున్న రోజుల్లో మహేశ్వరం, రావిర్యాల, శ్రీనగర్, గంగారం, నాగారం గ్రామాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని జేసీ పేర్కొన్నారు. ఇటీవల గంగారం గ్రామం సర్వే నెంబరు 181లో సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించినట్లు చెప్పారు. రావిర్యాల, కొంగర ఖుర్దు , నాగారం గ్రామాల్లో కంపెనీలు స్థాపించడానికి పలు ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
కొంగరఖుర్దు సర్వే నెం-289లో సుమారు 55 ఎకరాలు, గంగారం సర్వే నెంబరు 181లో సుమారు 120 ఎకరాలు, నాగారంలో సర్వే నెంబరు 181లో 45 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీ పరిశీలించారు. చెరువుల ఆక్రమణకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. జేసీ వెంట తహసీల్దార్ కె. గోపీరామ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ రఫీ తదితరులున్నారు.