నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు
జంగారెడ్డిగూడెం : రాష్ట్ర విభజన నేపథ్యంలో తన పరిధిలో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రేణుక తెలిపారు. సోమవారం రాత్రి ఆమె స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది ఎన్నికల నుంచి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను సీఐ జె.రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవిభజన నేపథ్యంలో చింతలపూడి శివారు గురుభట్లగూడెం, జీలుగుమిల్లి మండలం శివారు తాటియాకులగూడెం, అదేమండలంలోని రాచన్నగూడెం, సీతంపేట గ్రామాల్లో ఎక్సైజ్ చెక్‌పోస్టుల ఏర్పాటుకు అనుమతి లభించిందన్నారు. అయితే అక్కడ ఎంతమంది సిబ్బంది నియమించాలనేది ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు బెల్టుషాపుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికే 90 శాతం బెల్టుషాపులను అదుపుచేశామని చెప్పారు. బెల్టుషాపుల నివారణ నేపథ్యంలో నాటుసారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నందున వాటిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా నల్లబెల్లం అమ్మకాలపై కొరడా ఝులిపిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిఘా బృందాలను నియమించామన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో బూర్గుంపాడు, కుకునూరు, వేలేరుపాడు మండలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలిసినప్పటికీ అవి ఏ పరిధిలోకి వస్తాయో స్పష్టమైన ఆదేశాలు అందలేదన్నారు. ప్రస్తుతం ఏలూరు నుంచి ఆ మూడు మండలాలకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పరిధిలో పట్టుకున్న సుమారు 2వేల లీటర్ల నాటు సారాను ఆమె సమక్షంలో అధికారులు ధ్వంసం చేశారు.