అజ్మీర్ యాత్రే వారికి చివరిదైంది!
హైదరాబాద్: అజ్మీర్ దర్గా సందర్శనకు వెళ్లిన సికింద్రాబాద్ వారాసిగూడ ప్రాంతానికి చెందిన రెండు కుటుంబాలకు చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. దీంతో స్థానికంగా విషాదఛాయులు నెలకొన్నాయి. వారాసిగూడ నివాసి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ సభ్యుడు షకీల్‌ఖాన్, తన భార్య జుబేదాబేగం, కుమారులు ఉమాయాన్ఖాన్, సైఫ్‌ఖాన్, యాజాఖాన్, కుమార్తె దానియాబేగంతో పాటు వారింట్లో అద్దెకుండే సయ్యద్ షకీల్ కుటుంబం అజ్మీర్ దర్గాను సందర్శించేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలు దేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అజ్మీర్ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న టాటా సుమోను భారీ వాహనం ఢీ కొట్టింది.
దీంతో షకీల్‌ఖాన్ చిన్న కుమారుడు మహమ్మద్ సైఫ్‌ఖాన్ (7)తో పాటు సయ్యద్ షకీల్ (45) అతని కుమార్తెలైన మిజ్వా (1), ఉమేరా (7) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ షకీల్‌ఖాన్, జుబేదాబేగం, యజాఖాన్, దానియాబేగం, నజీమా బేగం, ఖాజాబేగం, ఉమాయాన్ఖాన్ అజ్మీర్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున వారాసిగూడలోని వారి నివాసాలకు తరలి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురికి ఆదివారం సాయంత్రానికి పోస్టుమార్టం పూర్తవుతుందని సోమవారం సాయంత్రం లోపు మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని బంధువులు తెలిపారు.
అంతా అయోమయంగా ఉంది: షకీల్‌ఖాన్
ప్రమాదంలో గాయాలపాలై కన్న కొడుకును కొల్పోయిన షకీల్‌ఖాన్ ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ తమ సుమోను భారీ వాహనం ఢీకొందని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదని చెప్పారు. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రి ఐసీయుూలో ఉన్నానని, తమ వాళ్ల సమాచారం వైద్యులు చెప్పడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.