వడివడిగా హాయివే.. పామర్రు నుంచి దిగమర్రు వరకు 4 లేన్ల ప్రయాణానికి సిద్ధం
ఆకివీడు: నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకం. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది.
తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చొరవతో ఈ పనుల్లో మళ్లీ పురోగతి కనిపిస్తోంది.
రెండు దశల్లో పనుల నిర్వహణ..
ఈ మొత్తం రహదారి పనులను రెండు ఫేజ్‌లుగా విడదీసి పనులు వేగవంతం చేశారు. పామర్రు నుంచి ఆకివీడు 64 కిలోమీటర్ల మేర ఒక ఫేజ్, అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 43 కిలోమీటర్ల మేర మరో ఫేజ్‌లో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పామర్రు నుంచి ఆకివీడు వరకూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
90 కల్వర్టుల నిర్మాణం..
పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. రూ.273 కోట్లతో పనులను చేపడుతున్నారు. దీనిలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనులను చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఆకివీడు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం
ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు.
నాలుగు జిల్లాలకు మేలు..
ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని.. దీని ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని వివరిస్తున్నారు.
వేగంగా పనులు
కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు చేపడుతున్నాం. 90 కల్వర్టులు, రెండు మేజర్ వంతెనల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
–ఎం.సత్యనారాయణరావు, DE, NH, కృష్ణా జిల్లా
కోర్టు అనుమతి రావాలి..
ఎన్‌హెచ్ 165 రహదారికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే 165 రహదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి.
– శ్రీనివాసరావు, DE, NH, పశ్చిమ గోదావరి జిల్లా