మావోయిస్టుల పేరుతో బెదిరింపులు, వసూళ్లు
అశ్వాపురం: మావోయిస్టు పార్టీ పేరుతో కాంట్రాక్టర్లను, వ్యాపారులను బెదిరిస్తూ డబ్బు లు డిమాండ్ చేస్తున్న నలుగురిని అశ్వాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు... జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ధర్మ సంపత్‌రెడ్డి, గజ్జల సమ్మయ్య, మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తలారి సుబ్బారావు, మణుగూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన నిమ్మల శ్రీపతి కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
తాము మావోయిస్టులమంటూ వ్యాపారులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బు గుంజుతున్నా రు. అశ్వాపురంలోని టీడీపీ సెంటర్లో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో వారిని అశ్వాపురం సీఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, మావోయిస్టు పార్టీ పేరుతోగల లెటర్ ప్యాడ్స్ స్వాధీనపర్చుకున్నారు.
వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పెట్రోల్ బంక్ యజమానిని బెదిరించిన కేసులో సంపత్‌రెడ్డి, సమ్మయ్య నిందితులుగా ఉన్నారు. సంపత్రెడ్డిపై గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురిని కోర్టుకు అప్పగించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ అల్లం నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.