విద్యుదాఘాతంతో విద్యార్థులకు గాయాలు
విశాఖపట్నం: ఇంటి పై ఆడుకుంటున్న పిల్లలు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైన సంఘటన విశాఖపట్టణం జిల్లా మాకవరపాలెం మండలం వజ్రగడ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఐదో తరగతి చదువుతున్న హర్ష(9), విష్ణు(10), రమ్య(9), గణేష్(10) అనే నలుగురు విద్యార్థులు ట్యూషన్ నిమిత్తం గ్రామానికి చెందిన మౌనిక టీచర్ ఇంటికి వెళ్లారు.
ఈ క్రమంలో టీచర్ లేకపోవడంతో ఆలోపు ఆడుకోవడానికి ఇంటిపైకి ఎక్కారు. రాత్రి వర్షం వచ్చిఉండటంతో ఇంటిపై నిల్వ ఉన్న నీటిలో ఆడుకుంటున్నారు. ఈక్రమంలో అక్కడ పడి ఉన్న ఇనుపకడ్డీ పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.