మరో ఏటీఎం.. నోట్ల వర్షం
ఏటీఎంలకు ఏమైందో తెలియదు గానీ.. నోట్ల వర్షం కురిపిస్తున్నాయి. నిన్న కాక మొన్న రాజస్థాన్లోని టోంక్ ప్రాంతంలో ఇలా జరిగితే, ఇప్పుడు తాజాగా అసోంలోని జమునాముఖ్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఏటీఎం కూడా కోరిన దాని కంటే నాలుగు రెట్ల మొత్తాన్ని ఇచ్చింది. ఏం జరుగుతోందో ఆ బ్యాంకు అధికారులకు తెలిసే సమయానికి.. ఏడు లక్షల రూపాయల మొత్తాన్ని జనం లాగేసుకున్నారు. ఆ ఏటీఎం ఉదారత్వం గురించి ఆనోటా ఈనోటా తెలిసిన జనం.. అక్కడకు వెళ్లి తమ ఖాతాలో ఉన్న మొత్తాన్ని డ్రా చేసుకోడానికి ప్రయత్నిస్తే, దానికి నాలుగు రెట్ల మొత్తం వచ్చింది.
సిస్టం ఎర్రర్ కారణంగా ఇలా జరిగిందని యూబీఐ జమునాముఖ్ బ్రాంచి మేనేజర్ కృష్ణ భౌమిక్ తెలిపారు. ఏటీఎంలోని స్లాట్లలో 500, 1000, 2000 రూపాయల నోట్లు పెట్టామని, ఒక వ్యక్తి వెయ్యి రూపాయలు కావాలని అందులో ఎంటర్ చేస్తే.. రెండు 500 రూపాయల నోట్లకు బదులు రెండు 2000 రూపాయల నోట్లు వచ్చాయని ఆయన వివరించారు. విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపినా, అధికారికంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. ఫిర్యాదు చేయాలా వద్దా అన్న విషయమై స్పష్టత కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని భౌమిక్ చెప్పారు. ఎవరెవరు ఎంతెంత మొత్తం తీసుకున్నారో అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాళ్ల నుంచి వారివి కాని డబ్బులు కూడా వెనక్కి తీసుకుంటామని తెలిపారు.