జస్టిస్ గౌతమ్ పటేల్ కీలక వ్యాఖ్యలు
ముంబై : ముంబై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ స్టాక్ఎక్స్చేంజ్ ఏజెంట్గా ఉన్న అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకరేజ్ సంస్థ పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడిన కేసులో సమాచారాన్నంతటినీ సీల్డ్ కవర్లో అందజేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత వుండాలన్నారు. సీల్డ్ కవర్లోని సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో ఉంచాలన్నారు. పిటిషనర్లకు అందజేయాలని సదరు బ్రోకరేజ్కు ఆదేశించారు. అయితే ఇది చాలా సున్నితమైన అంశమని..మీడియాకు పొక్కకూడదనే సీల్డ్ కవర్లో ఇస్తున్నామని, ఆ బ్రోకరేజ్ సంస్థ పేర్కొనడం పట్ల గౌతమ్ పటేల్ మండిపడ్డారు.
'నేను స్వయంగా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. మీడియా పని మీడియాది, నా పని నాది.. నా ముందు దాఖలు చేసిన పత్రాలు చూసి ఓ నిర్ణయానికి వస్తాను తప్ప.. నా ఇంటికొచ్చే న్యూస్ పేపర్లు చూసి కాదు. మీడియాకు ఓ గురుతరమైన బాధ్యత వుంది.. దానిని అది నెరవేరుస్తుంది. మీడియాలో వార్తలు రాకూడదని ప్రతివాది అడిగినంత మాత్రాన నేను గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వను. నా కోర్టులో ఎప్పుడూ గ్యాగ్ ఆర్డర్లు ఉండవు. మీడియాది ఎప్పుడూ బాధ్యతారాహిత్యమేనని చేసే వాదనతో ఏకీభవించను. నేను చూసేది.. నా ఎదురుగా వున్న ఇరు పక్షాలు చూడాలి.. ఆ హక్కు వారికి వుంది. ఇక్కడ గ్యాగ్ ఆర్డర్లు వుండవు..నా కోర్టులో సీల్డ్ కవర్ వ్యవహారాలనే ప్రశ్నకు తావేలేదం'టూ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు.