వాళ్లు ఎప్పుడైనా ‘రెజ్లింగ్’ చూశారా!
ఫ్రాంచైజీలపై సుశీల్ ఆగ్రహం ప్రొ లీగ్ నుంచి తప్పుకోవడంపై వివరణ
న్యూఢిల్లీ: తొలిసారి నిర్వహించిన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) నుంచి చివరి నిమిషంలో తాను తప్పుకోవడంపై స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ నోరు విప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్లే తాను ఈ లీగ్‌లో ఆడలేదని, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి సూచన మేరకు లీగ్‌లో పాల్గొనలేదని అతను స్పష్టం చేశాడు. ‘మా కోచ్ సత్పాల్సింగ్, సమా ఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌తో మాట్లాడిన తర్వాత మ్యాచ్ ఫిట్ గా మారేందుకు జార్జియాలో 21 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాను. అయితే తిరిగొచ్చిన తర్వాత నేను 100 శాతం ఫిట్‌గా లేనని అనిపించింది. నేను లీగ్‌లో పాల్గొనడంకంటే రియో ఒలింపిక్స్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉండటం ముఖ్యమని భావించారు. అం దుకే ఆడలేదు’ అని సుశీల్ కుమార్ స్పష్టం చేశాడు.
నా గురించి మాట్లాడే స్థాయి లేదు...
రెజ్లర్‌గా తన ప్రాధాన్యాలు మారాయని, ఇతర ఒప్పందాలతో బిజీగా ఉండటం వల్లే పాల్గొనలేదని లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యురాలు రష్మి సులేజా, నిర్వాహకులు ప్రొ స్పోర్టిఫై, ఫ్రాంచైజీ యజమానులు చేసిన విమర్శలపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నర్సింగ్ యాదవ్‌తో పోటీ పడలేకే తప్పుకున్నాడని మరొకరు చేసిన వ్యాఖ్యను కూడా సుశీల్ తిప్పి కొట్టాడు. ‘ఫ్రాంచైజీ యజమానులు నన్ను కలిసిన వారం రోజుల్లోపే నా గురించి తెలుసుకునేంత తెలివైనవారా.
అసలు వారికి రెజ్లింగ్ గురించి ఏమైనా తెలుసా. ఒక్కసారైనా కనీసం మ్యాచ్ చూశారా. 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత నా జీవితంలో అన్నీ పొందాను. అసలు నా స్థాయి గురించి వారికేమీ తెలీదు. నర్సింగ్‌తో గతంలో చాలా సార్లు తలపడి గెలిచాను. ఒక రెజ్లర్ ప్రత్యర్థి గురించి భయపడటం మొదలు పెడితే అతను ఒలింపిక్స్‌లో పాల్గొనడం గురించి మర్చిపోవాలి. నర్సింగ్ స్థానం కోల్పోరాదనే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నేను ఆడలేదు. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరిలో ఎవరికో ఒకరికే రియోకు అవకాశం లభిస్తుందనుకుంటే పోరాడి సాధిస్తా’ అని గట్టిగా బదులిచ్చిన సుశీల్ కుమార్... వచ్చే ఏడాది కూడా ఈ లీగ్ ఉంటే అప్పుడు పాల్గొనడంపై ఆలోచిస్తానని చెప్పాడు