ఏకే 47, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదుల దాడి
ఉగ్రవాదులు ఏకే 47 తుపాకులు, రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మిషన్ గన్లతో ప్యారిస్ నగరంలోని పత్రికా కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. ఫ్రాన్స్‌లోని అన్ని మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గత కొన్ని వారాలుగా పలు ఉగ్రవాద కుట్రలను ముందుగానే అడ్డుకున్నామని హోలండ్ అన్నారు. తాజాగా చార్లీ హెబ్డో కార్యాలయంపై జరిగిన ఉగ్రవాద దాడి అత్యంత హేయమైనదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. పత్రికా కార్యాలయంలోకి ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా మెట్లు ఎక్కి లోపలకు వెళ్లిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత ఒక్కసారిగా తుపాకులతో కాల్పులు జరిపి, లాంచర్లతో రాకెట్లు కూడా ప్రయోగించారు. దాంతో పదిమంది అక్కడికక్కడే మరణించారు. తిరిగి పారిపోతూ.. రోడ్డుమీద ఉన్నవారిపై కూడా కాల్పులు జరిపారు. దాంతో ఓ పోలీసు అక్కడే మరణించారు. అనంతరం ఇద్దరు ఉగ్రవాదులు పత్రికా కార్యాలయం సమీపంలోని ఓ మెట్రో స్టేషన్ వైపు పారిపోయారు.
కాగా, ప్యారిస్ ఘటన హేయమైన చర్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రెంచి వాసులకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై పోరుకు తాము ఎప్పుడూ ముందుంటామని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఉండాల్సిందేనని ఆయన చెప్పారు.