కులాల మధ్య సౌభ్రాతృత్వమే అంబేడ్కరిజం
సందర్భం
కులాల మధ్యన సౌభ్రాతృత్వ సాధననే అంబేడ్కర్ ఆలోచనా విధానంగా చెప్ప వచ్చు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృ త్వం అనే ఫ్రెంచ్ విప్లవం మూడు ప్రధాన సూత్రాల్లో చివరిదైన సౌభ్రాతృ త్వానికి అంబేడ్కర్ అంత ప్రాధాన్యతను ఎందుకిచ్చారో తెలుసుకోకుంటే, అంబేడ్కరిజాన్ని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. సౌభ్రాతృత్వ పునాదులు లేకుండా సమానత్వం, స్వేచ్ఛ భారతీయ సమాజంలో సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే హిందూ మతంలో సమానత్వం అసాధ్య మేనని చెప్పవచ్చు. ఎందుకంటే హిందూ సమాజం వర్ణం/కులం ఆధారంగా ఏర్పడింది. మొత్తం సమాజం ఏకంగా భావించినా అది నిట్టనిలువునా చీలి ఉంటుంది. ఇది దొంతరలతో కూడిన నిర్మాణం. ఒక కులం, దానిపైన ఇంకో కులం లేదా దానికింద మరో కులం. ఇలా ఈ చీలిక శాశ్వత నిర్మాణంగా ఉంటుంది. ఇలాంటి వివక్షతో కూడిన సమాజ నిర్మాణానికి మతపరమైన పవిత్రతను ఆపాదించారు. ఇది కులాంతరీకరణకు వ్యతిరేకం.
ఒక కులం ఇంకో కులంతో సమానం కాదు కాబట్టి కులాంతర వివా హాలు నిషేధం. ఇది సామాజిక అనుసంధానం కంటే తృణీకరణనే ప్రోత్సహిస్తుంది. పైగా మనుస్మృతి మనుషులను సమానులుగా చూడలేదు కాబట్టి నేరాలకు కూడా కులాలను బట్టి శిక్షలు విధించారు. ఇది చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే మౌలిక సూత్రానికే వ్యతిరేకం.
స్వేచ్ఛను అనుభవించడానికి కొన్ని సామా జిక పరిస్థితులు ఏర్పడి ఉండాలని అంబేడ్కర్ అన్నారు. అవి సామాజిక సమానత్వం, సార్వ త్రిక, లౌకిక విద్య కులాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండటం, వృత్తిపరమైన ఆర్థిక రక్షణ. ఈ మూడు పరిస్థితులు లేని చోట స్వేచ్ఛ మనగలగడం అసాధ్యం. అయితే హిందూ సమా జంలో సమానత్వానికి స్థానమేలేదు. అదే విధంగా విద్యను ఒక హక్కుగా అది భావించదు. కేవలం అగ్రవర్ణాలకు పరిమితమైన గురుకుల విద్యా విధానంతో కూడుకుని ఉండటం వలన అది విద్యలో సమానత్వాన్ని కోరుకోలేదు. అదేవిధంగా కులాలకు, వ్యక్తులకు ఎలాంటి ఆర్థిక స్వేచ్ఛను హిందూ మతం ఇవ్వలేదు.
హిందూ సమాజంలో సౌభ్రాతృత్వానికి స్థానం లేదు. అంబే డ్కర్ ప్రకారం సౌభ్రాతృత్వం అంటే తోటి వారిని కులం గురించి ఆలోచించకుండా సమానంగా చూడడం. ఈ దేశంలో ప్రతి కులం తన కుల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుంది. ప్రతి కులానికి ఒక జాతీయతకుండే అన్ని లక్షణాలు ఉంటాయంటారు అంబేడ్కర్. కాబట్టి కులం ఆధారంగా ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేమంటారు.
భారత సమాజంలో ఆహార సంస్కృతి కూడా కులం చుట్టూ అల్లుకొని ఉన్నది. మాంసాహారాన్ని అందులో గొడ్డు మాంసాన్ని తక్కువ చూడడం, దానితోపాటు ఎవరు ఏది తినాలనే నియమం పెట్టడం, ఇవన్నీ కూడా కులాల సౌభ్రాతృత్వానికి అడ్డుగోడలు. అంబేడ్కర్ హిందూ సామాజిక మనస్తత్వాన్ని ‘‘వివిధ కులాల మధ్యన గౌరవం కోసం జరిగే శత్రుత్వ పోరాటాలు’’ అనీ, అలాగే ‘తమపై కులా లను ద్వేషించడం - కింది కులాలను నీచంగా చూడడం’ జరుగు తుందనీ నిర్వచించారు. కులం వెలుపల పుట్టుకలు, పెళ్లిళ్లు, పండు గలు, చావులు జరగవు. అలాగే కులాల మధ్య కంచం పొత్తు- మంచం పొత్తు ఉండదు. ఇది మత ఆధారిత వ్యవస్థ. కాబట్టి హిందూ సమాజంలో సౌభ్రాతృత్వానికి ఆస్కారమే లేదు.
సామాజికంగా కుల సంఘ ఉద్యమాల ద్వారా అంబేడ్కరి జాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునేవారు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే కుల సంఘాల ద్వారా సౌభ్రాతృత్వం సాధించకపోగా మిగత కులాల వారితో వైరి/ వైరుధ్యం పెరుగుతుంది. అట్లాంటి ఉద్యమాలు కేవలం తమ కులాలలో ఉన్న వ్యక్తులకు కొన్ని పద వులు/ రాయితీలు తెచ్చిపెట్టవచ్చు కాని మొత్తం మీద అంబేడ్కర్ ఉద్యమాన్ని దెబ్బతీసినవాళ్లవుతారు. అలాగే వర్గ పోరాటాల వల్ల కూడా సౌభ్రాతృత్వ సాధన అసాధ్యం. ప్రజల్లో వర్గ భావం కాకుం డా కుల భావమే ఉంటుంది కాబట్టి ‘వర్గ ఐక్యత’ సాధించడం హిందూ సమాజంలో అసాధ్యం. అది కేవలం కుల నిర్మూలన ద్వా రానే సాధ్యం. కుల నిర్మూలనకి కూడా సౌభ్రాతృత్వమే పునాది. భారతదేశంలో ఆ పునాదిని ఏర్పరిచింది రిజర్వేషన్లు; కుల సంఘా లు ఏర్పాటు చేసుకొని గిరిగీసుకొని కూర్చుంటే అది సౌభ్రాతృ త్వానికి దారి తీయదు. సమాజంలోని అట్టడుగు కులాలను ఏకం చేయడం రాజకీయ ఉద్యమం ద్వారానే సాధ్యం.
ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసింది కాన్షీరాం బహుజనవాదం - బహుజన ఉద్యమం; ఆయన అన్నట్టు కులాన్ని ఇంకో కులంతో కలపడం - దాని ద్వారా రాజకీయ చైతన్యం పెంపొందించి; దాన్ని రాజకీయా ధికారంగా మార్చడం, రాజకీయాధికారాన్ని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక మార్పులకు ఉపయోగించడం. తద్వారా అంబేడ్కర్ ఆకాంక్షించినట్టు ‘‘ప్రబుద్ధ భారతాన్ని’’ నిర్మించడం. అంటే అది కేవలం ‘అంబేడ్కర్ ఐడియాలజీ- కాన్షీరాం మెథడాలజీ’ ద్వారానే సాధ్యం. ఆ విధంగా కేవలం సౌభ్రాతృత్వం ఆధారంగా భారత సమాజాన్ని పునర్నిర్మించడమే భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు మనం అర్పించే నిజమైన నివాళి.
- డా. వెంకటేశ్ నాయక్ వదిత్య
(నేడు బాబాసాహెబ్ అంబే డ్కర్ 59వ వర్ధంతి)
వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, ఇఫ్లూ 72072 50809