బై వన్ గెట్ వన్ ఆఫర్లకు ఇక కాలం చెల్లినట్టేనా..?
న్యూఢిల్లీ : వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించే ఉచిత డీల్స్ ...ఒకటి కొను మరొకటి ఉచితంగా పొందు(బై వన్ గెట్ వన్ ఫ్రీ) డీల్స్ ఇక కోల్పోనున్నామా..? అంటే నిజంగానే ఇవి ఇక ఉండవట. జీఎస్టీ బిల్లుతో ఈ ఉచిత డీల్స్ కు కళ్లెం పడనుందట. ఈ ప్రతిపాదిత జీఎస్టీ బిల్లు ఉచితంగా కొనే వస్తువులకు కూడా వర్తించే విధంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ బిల్లులోని సెక్షన్ 3 షెడ్యూల్డ్ 1 ప్రకారం ఉచిత సప్లైలా, ప్రైవేట్ సప్లై లా అనేది పరిగణలోకి తీసుకోకుండా ఈ పన్ను వర్తిస్తుంది. దీంతో ఉచితంగా వచ్చే వాటికి కూడా కొనుగోలుదారుడు వస్తుసేవల పన్నును చెల్లించాల్సి ఉంటుందని పన్ను నిపుణులు తెలుపుతున్నారు. ఈ నిబంధన ప్రముఖమైన అమ్మకాలపై ఎక్కువగా ప్రభావం చూపగలదని చెబుతున్నారు.
బిజినెస్ ప్రమోషన్ కోసం ఇచ్చే ఉచిత సాంపిల్స్ కు కూడా జీఎస్టీ వర్తిస్తుందా.. లేదా... అనే దానిపై మరింత సూత్రపాయంగా క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. ఉచిత సరఫరాలపై వేసే ప్రత్యక్ష, పరోక్ష జీఎస్టీ, కంపెనీలు ఖర్చు చేసే సేల్స్ అండ్ మార్కెటింగ్ వాటిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని పీడబ్ల్యూసీ లోని నేషనల్ ఇన్ డైరెక్ట్ టాక్స్ లీడర్ ప్రతీక్ జైన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే మోడల్ జీఎస్టీ బిల్లు ఉచిత షాంపుల్స్ పై ఎటువంటి నిర్దిష్ట మార్గదర్శకాలు ఇవ్వలేదని జీడీఓ ఇండియా ఇన్ డైరెక్టర్ టాక్స్ పార్టనర్ ప్రశాంత్ రాయిజాడా అన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రం విధించే వివిధ రకాల పన్నుల నుంచి వినియోగదారులను తప్పించి, దేశమంతటా ఒకేవిధమైన పన్ను విధానం జీఎస్టీని తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.