ప్రసవ సమయంలో ఉచితంగా రక్తం పంపిణీ
సాక్షి, ముంబై: ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి తల్లికి, బిడ్డకు రక్తం అవసరమైతే ఉచితంగా సరఫరా చేస్తామని మహానగర పాలక సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ వెల్లడించారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో ఎక్కువ ధర చెల్లించి రక్తం కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. సాధారణంగా కొందరు మహిళలకు ప్రసవం సమయంలో తీవ్ర ర క్తస్రావం జరుగుతుంది. సిజరింగ్ అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. దీంతో తల్లి, బిడ్డ ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.
రక్తం కోసం ఆస్పత్రులు, బ్లడ్బ్యాంకుల చుట్టూ పరుగులు తీయాల్సి వస్తుంది. ఆ సమయంలో బంధువుల పరిస్థితి వర్ణణాతీతం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహానగర పాలక, ఉపనగర, ప్రసూతి గృహాలలో రక్తం అందుబాటులో ఉంటుందని కేస్కర్ చెప్పారు.
ఒకవేళ శిశువు తక్కువ బరువుతో జన్మించినా, ఇతర కారణాల వల్ల రక్తం అవసరమైనా శిశువుకు 30 రోజుల వరకు ఉచితంగా రక్తం సరఫరా చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం మహానగర పాలక ఆస్పత్రుల్లో గర్భిణీలకు ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రా సౌండ్, సోనోగ్రఫీ తదితర సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అవసరమైన బ్లడ్ గ్రూప్ లేకపోతే.. నగరంలో ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకుని అందజేస్తారు. ఈ పథకాన్ని అన్ని కార్పొరేషన్ ఆస్పత్రుల్లో అమలు చేస్తున్నామని, సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.