బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)ప్రీపేయిడ్, పోస్ట్ పేయిడ్ వినియోగదారుల కోసం ఒక తీపి కబురు అందించింది. గత ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన ఫ్రీ రోమింగ్ సర్వీసును మరో ఏడాది పొడిగించినట్టు ప్రకటించింది. వినియోగదారుల సౌకర్యార్థం 'ఉచిత నేషనల్ రోమింగ్' సేవను విస్తరించడానికి నిర్ణయించామని బిఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి స్కీంతో వినియోగదారులనుంచి అనూహ్యమైన స్పందన వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బిఎస్ఎన్ఎల్ కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ వెల్లడించారు. ట్రాయ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో అత్యధిక వృద్ధిని సాధించామన్నారు.
కాగా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు గాను బీఎస్ఎన్ఎల్ ఇదివరకే ప్రవేశపెట్టిన ఉచిత కాల్స్ పథకంతో మంచి ఆదరణ లభించింది. దీనికి తోడు ఉచిత నేషనల్ రోమింగ్ సదుపాయం సంస్థకు భారీ ఊతమిచ్చిన సంగతి తెలిసిందే.