సార్క్ సమష్టిగా కదులుతుందా?
ప్రపంచంలో నాలుగోవంతు జనాభా, అపరిమితమైన ప్రకృతి వనరులు, ఒకటి రెండు దేశాలమధ్య మినహా అంతగా శత్రుత్వంలేని స్థితి...ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందడానికీ, తిరుగులేని శక్తిగా ఎదగడానికీ ఇవి చాలు! కానీ, ఇప్పుడు రెండురోజుల శిఖరాగ్ర సదస్సు కోసం కఠ్మాండూలో కొలువుదీరిన దక్షిణాసియా ప్రాంతీయ సహకారం మండలి(సార్క్)కి ఏదో శాపమున్నట్టుంది. పుట్టి మూడు దశాబ్దాలవుతున్నా సహకారం మాట అటుంచి పౌరుల మధ్య సదవగాహన పెంపొందించే కనీస చర్యలు కూడా శూన్యం.
2016 నాటికి సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పరిఢవిల్లాలని సంకల్పం చెప్పుకుని కూడా ఇప్పటికి చాలా ఏళ్లు గడిచిపోయాయి. అయినా సార్క్ దేశాల మధ్య జరిగే వాణిజ్యం విలువ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కనీసం 5 శాతమైనా లేదు! సార్క్‌కు ముందు పుట్టినవీ, ఆ తర్వాత కళ్లు తెరిచినవీ చకచకా ముందుకు అడుగులేస్తుంటే ‘పుట్టేవాళ్లకు అన్నయ్య...పెరిగేవాళ్లకు తమ్ముడు...’అన్నట్టు సార్క్ నిమ్మకు నీరెత్తింది! 1985లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక తదితర ఏడు దేశాలతో అవతరించిన సార్క్‌లో 2005కల్లా అఫ్ఘానిస్థాన్ కూడా వచ్చిచేరింది.
అమెరికా, యూరోప్ యూనియన్ (ఈయూ), జపాన్, చైనా వంటివి కోరి మరీ పరిశీలక హోదాను పొందాయి. నిర్ణీత కాలవ్యవధిలో శిఖరాగ్ర సమావేశాలకూ లోటులేదు. అందులో చేసే తీర్మానాలకూ కొదువలేదు. ఇరుగు పొరుగు మధ్య సత్సంబంధాలతోనే శాంతి, సుస్థిరత ఏర్పడతాయని... ప్రపంచంలోనే పటిష్ట శక్తిగా ఎదగడానికి అవకాశాలు తలుపుతడతాయని ఈ తీర్మానాల్లో చేసే ఉద్ఘాటనలకూ లోటు లేదు. అమ్మకు గుడి కట్టడంపై రాత్రి తెల్లవార్లూ చర్చించుకుని సూర్యోదయం తర్వాత ఎవరి దారిన వారు వెళ్లినట్టు ఈ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుత శిఖరాగ్ర సమావేశాలూ అంతే కావొచ్చునని ఎవరైనా పెదవి విరిస్తే తప్పు వారిది కాదు.
సార్క్‌లోని ప్రతి దేశానికీ అవతలి దేశం కదలికలపై, దాని ప్రయోజనాలపై శంకలున్నాయి. ఈ సదస్సులో సైతం అవి ప్రతిఫలించాయి. ముఖ్యంగా భారత్, పాక్‌ల మధ్య ఇటీవలి కాలంలో ఇవి ఎక్కువయ్యాయి. సదస్సు సందర్భంగా తొలినాడు ఇరు దేశాల ప్రధానులూ ఒకే వేదికపై ఆశీనులైనా పలకరింపులు సరే...కనీసం మర్యాదకైనా చిరునవ్వులు లేవు. దానికితోడు మన దేశం ప్రతిపాదించిన మూడు ప్రాంతీయ ఒడంబడికలను పాక్ అడ్డుకుంది. ఈ మూడూ నిజానికి అడ్డంకొట్టాల్సినంత ‘ప్రమాదకరమైనవి’ కాదు. సార్క్ దేశాలమధ్య రోడ్డు, రైలు రవాణా..ఇంధన రంగంలో సహకరించుకోవడం వీటి ప్రధాన ఉద్దేశం.
తమ దేశంలో అంతర్గత మదింపు ఇంకా కొలిక్కి రాని కారణంగా మొదటి రెండు ఒప్పందాలపైనా సంతకం చేయడం సాధ్యం కాదని పాక్ చెబుతున్నది. ఈ విషయంలో దాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యాయి. గురువారం సమావేశాలు ముగిసే సమయానికి కనీసం ఇంధన ఒప్పందంపైన అయినా అంగీకారం కుదురుతుందేమో చూడాలి. నిజానికి రోడ్డు రవాణా రంగంలో కుదిరే ఒప్పందంవల్ల ఎక్కువ లాభపడేది పాకిస్థానే! యాదృచ్ఛికమే కావొచ్చుగానీ...సరిగ్గా ముంబై నగరంపై పాక్‌నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేసిన నవంబర్ 26నే సార్క్ సదస్సు ప్రారంభమైంది.
అందువల్లే ఉగ్రవాదం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించి దక్షిణాసియాలో సమష్టిగా కృషిచేసి దానికి స్థానం లేకుండా చేద్దామని పిలుపునిచ్చారు. వాస్తవానికి పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లు మనకంటే ఎక్కువగా ఉగ్రవాదం బెడదను ఎదుర్కొంటున్నాయి. అంతేకాదు... ఉగ్రవాదానికి పాక్ అడ్డాగా ఉన్నదని ఇన్నాళ్లుగా మన దేశం చేస్తున్న ఆరోపణలను ఇటీవల అమెరికా రక్షణ శాఖ సైతం ధ్రువీకరించింది. అందువల్ల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాద బెడద అంతానికి తమ సహకారం ఉంటుందని ప్రకటించి ఉంటే సబబుగా ఉండేది.
అయితే ఆయన ఆ పని చేయలేదు. భారత్‌తో ఉన్న వైరానికి తమ గడ్డను వేదికగా చేసుకునేందుకు పాక్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ప్రసంగం పరోక్షంగా ప్రస్తావించింది. అసలు 1987లో ఉగ్రవాదంపై కుదిరిన సార్క్ ఒప్పందాన్ని సక్రమంగా అమలు జరపడానికి పూనుకుంటే దక్షిణాసియాలో ఇంత విధ్వంసం చోటుచేసుకునేదే కాదు.
సార్క్‌లో సభ్యత్వం కోసం నేపాల్ ద్వారా చైనా చేస్తున్న ప్రయత్నం సార్క్‌లో కొత్త పరిణామం. పాకిస్థాన్, శ్రీలంకల్లో ఇప్పటికే చైనా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటున్నది. నేపాల్ అభివృద్ధికి 160 కోట్ల సాయం అందజేయడానికి ముందుకొచ్చింది.
గత దశాబ్దకాలంలో నిస్తేజంగా మారిన మన విదేశాంగ విధానం పర్యవసానమే ఇదంతా. నిజానికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం సాధించిన అభివృద్ధిని సార్క్ దేశాలకు అందించవచ్చు. మౌలిక సదుపాయాల రంగంలో అన్నివిధాలా తోడ్పడవచ్చు. మనకు పటిష్టమైన ఫార్మా రంగం ఉన్నది గనుక ప్రాణాంతక వ్యాధులకు చవకగా ఔషధాలు సమకూర్చవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి తోడ్పడటంలో, ఉపగ్రహ సమాచారాన్ని అందించడంలో మనకెన్నో అవకాశాలున్నాయి.
క్షయవ్యాధిపై ప్రాంతీయ పరిశోధనా సంస్థ నెలకొల్పడానికి, వ్యాపార రంగంలో పనిచేసే వారికి మూడు నుంచి అయిదేళ్లు చెల్లుబాటయ్యే వీసాల మంజూరుకు మోదీ సంసిద్ధత తెలిపారు. దక్షిణాసియాతో సంబంధం లేకున్నా తన పలుకుబడిని విస్తరించుకోవడానికి చైనా తహతహలాడుతున్న నేపథ్యంలో మోదీ ఇవ్వజూపిన ఇలాంటి వరాలు ఈ ప్రాంతంలో మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు ఉపయోగపడతాయి. మారిన ప్రపంచ సమీకరణాల నేపథ్యంలో సార్క్ తన జడత్వాన్ని వదులుకుని...పరస్పర అపనమ్మకాలను విడనాడి స్పష్టమైన లక్ష్యంతో చురుగ్గా కదులుతుందని, అభివృద్ధిని సాధిస్తుందని ఆశించాలి.