జియోకు షాక్: బీఎస్ఎన్ఎల్ ఫ్రీ ఆఫర్
న్యూడిల్లీ: ఉచిత ఆఫర్లతో టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. దీంతో జియో పోటీని తట్టుకునేందుకు వీలుగా దేశీయ టెలికాం కంపెలు అనేక ఆఫర్లతో ముందుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియోకు చెక్ పెట్టేలా, జియో తాజా ఆఫర్ కు దీటుగా ప్రభుత్వం రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) దూసుకు వస్తోంది. తమ చందాదారులకు నెలకు ఉచిత వాయిస్ కాల్స్ , ఇతర ఫ్రీ ఆఫర్లతో కొత్త మంత్లీ ప్లాన్ ను పరిచయం చేయబోతోంది. జనవరి 1 నుంచి ఈ బంపర్ ఆఫర్ ను వినియోగదారులకు అందించనుంది. నెలకు రూ.149 రీచార్జ్ తో ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ వాయిస్ కాల్స్ తోపాటు 300 ఎంబీ డాటా సదుపాయంతో ఈ ప్లాన్ ను లాంచ్ చేయనుంది.
నెల రూ 149 వద్ద భారతదేశం అంతటా ఏ నెట్వర్క్ వద్ద మొబైల్ చందాదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. జియో వ్యూహాత్మక ధరలు, ప్రధాన ప్రత్యర్థులు భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్ ఆఫర్ల నేపథ్యంలో కొత్త చందాదారులను ఆకట్టుకోవడంతోపాటు ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంపై దృష్టిపెట్టినట్టు ఆయన చెప్పారు.
కాగా 2015-16 సంవత్సరానికి గాను బీఎస్ఎన్ఎల్ సుమారు ఆరు రెట్ల వృద్ధితో రూ. 3,855కోట్ల నికర లాభాలను ప్రకటించింది. జియో 28-రోజుల వాలిడిటీతో , 300 ఎంబీ డేటా , అన్ లిమిటెడ్ కాల్స్ , 100 లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్ లను రూ.149 రీచార్జ్ ప్లాన్ లో అందిస్తున్న సంగతి తెలిసిందే.