ఫ్రెంచ్ బృందంతో సీఆర్డీఏ చర్చలు
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాజెక్టుల గురించి ఫ్రెంచ్‌కి చెందిన ఇద్దరు సభ్యుల బృందంతో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ చర్చలు జరిపారు. శుక్రవారం సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమైన ఆయన అమరావతి నగర ప్రణాళిక, అక్కడి మౌలిక వసతుల ప్రాజెక్టులు, సామాజిక, ఆర్థిక మాస్టర్ప్లాన్లను వివరించారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి సాంకేతిక సహకారం అందిస్తామని ఫ్రెంచ్ బృందం హామీ ఇచ్చింది.
ప్రజా రవాణా, విద్యుత్, నీరు, సివరేజ్ వ్యవస్థల ఏర్పాటు గురించి చర్చించి ఫ్రెంచ్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏఎఫ్‌డీ) ద్వారా రుణమిచ్చే అవకాశాలను వారు వివరించారు. అలాగే అమరావతితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికున్న అవకాశాల గురించి తెలుసుకునేందుకు త్వరలో ఫ్రెంచ్ ప్రతినిధుల బృందం రానున్నట్లు తెలిపారు. చర్చల్లో ఇండియాలో ఫ్రెంచ్ ఎంబసీ కౌన్సిలర్ ఫ్యాన్నీ హెర్వె, ఎఎఫ్‌డీ ప్రాజెక్టు డెరైక్టర్ హెర్వె డుబ్రియెల్ పాల్గొన్నారు.