french gayana
-
ఈయూ ఆంక్షలు.. రష్యా సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ ట్విట్టర్ వేదికగా.. ఈయూ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి యూరప్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలకు సహకారం నిలిపివేస్తున్నామని అన్నారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ కాస్మోడ్రోమ్, రోసోకాస్మోస్ నుంచి రష్యా రాకెట్ ప్రయోగ సిబ్బందిని, సాంకేతిక నిపుణులను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు. -
విను వీధిలోకి వెబ్ టెలిస్కోప్!
కౌరూ: ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం శనివారం దిగ్విజయంగా ముగిసింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకోవడంలో ఈ టెలిస్కోప్ కీలకపాత్ర పోషించనుంది. భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల పట్టవచ్చు. అక్కడ కక్ష్యలోకి ప్రవేశించి సర్దుకొని పని ప్రారంభించేందుకు మరో 5 నెలలు పడుతుందని అంచనా. అంటే 6 నెలల అనంతరం(సుమారు 2022 జూన్ నాటికి) వెబ్ టెలిస్కోపు తన ఇన్ఫ్రారెడ్ నేత్రంతో చూసేవాటిని భూమికి పంపడం ఆరంభమవుతుంది. ఒక టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఈ టెలిస్కోపులో పలు దర్పణాలున్నాయి. దీన్ని ఒరిగామి(జపాన్‌లో కాగితాన్ని వివిధ ఆకృతుల్లోకి మడిచే కళ) పద్ధతిలో మడిచి రాకెట్ కొనభాగంలో జాగ్రత్త చేశారు. నిర్దేశిత స్థానం చేరేలోపు ఇది నెమ్మదిగా దానంతటదే విచ్చుకుంటాయి. ఖగోళ రహస్యాల గుట్టు విప్పేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇదే అత్యంత క్లిష్టమైందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. నాసా హర్షం మన విశ్వాన్ని గురించి అందులో మన స్థానం గురించి మరింత అవగాహన కల్పించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగం విజయవంతం కావడంపై నాసా సంతోషం వ్యక్తం చేసింది. 1990నుంచి సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా భావిస్తున్న ఈ టెలిస్కోపుతో.. మనమెవరం? అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని బిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దీన్ని ఈ నెల 22న ప్రయోగించాల్సిఉండగా వివిధ కారణాలతో రెండు మార్లు వాయిదా పడి చివరకు క్రిస్మస్ రోజున నింగికెగిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీని ప్రయోగం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు లాంచింగ్ సమయం వచ్చేసరిగి లాంచింగ్ స్టేషన్ మొత్తం ఉద్విగ్నత వ్యాపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదున్నరకు ఏరియన్ రాకెట్ దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మానవాళి కోసమని ఏరియన్‌స్పేస్ సీఈఓ స్టీఫెన్ ఇస్రాయెల్ ఆనందం వ్యక్తం చేశారు. టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశించాక మనం ఆకాశాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. మరో మూడు రోజుల ప్రయాణం అనంతరం టెలిస్కోపులోని సన్ షీల్డ్ తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకునేందుకు 5 రోజులు పడుతుంది. అనంతరం 12 రోజుల పాటు మిర్రర్ సెగ్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో తెరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా జరిగేలా చూడడానికి వందలమంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు. జేమ్స్ వెబ్ విశేషాలు... ► దాదాపు 16లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ స్థానం వద్దకు చేరుతుంది. ► సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టే సామర్ధ్యం దీని సొంతం. ► బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ అంశాల పరిశీలన దీని ముఖ్య లక్ష్యం. ► దీని తయారీలో దాదాపు 10వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్లగంటల పాటు పనిచేశారు. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసాకు చెందిన దాదాపు 20కి పైగా దేశాలకు దీనిలో భాగస్వామ్యముంది. ► 50 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఆరంభించిన ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 966 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది. ► 1996లో ఆరంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పాతికేళ్లు పట్టింది. ► దీని సైజు 72గీ39 అడుగులు. బరువు 6 టన్నులు. కనీసం పదేళ్లు పనిచేస్తుంది. ► దీనిలో బంగారు పూత పూసిన 6.5 మీటర్ల వ్యాసమున్న 18 షట్కోణ ఫలకాల దర్పణం ఉంది. ► 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను ఈ దర్పణం గమనించగలదు. ► సూర్యకాంతిలో మండిపోకుండా –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియం సౌర కవచం అమర్చారు. ► కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. ► ఎల్2 వద్దకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో పనిప్రారంభించడానికి ఐదు నెలలు పడుతుంది. -
జీశాట్–31 ప్రయోగం సక్సెస్
శ్రీహరికోట(సూళ్లూరుపేట)/బెంగళూరు: దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్–31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.31 గంటలకు ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్–5 ఉపగ్రహ వాహక నౌక (రాకెట్ వీఏ 247) ద్వారా జీశాట్–31 కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ పరిశోధన కేంద్ర డైరెక్టర్ కున్హికృష్ణన్ పర్యవేక్షణలో సుమారు రూ.400 కోట్ల వ్యయంతో తయారు చేశారు. జీశాట్–31తోపాటు సౌదీకి చెందిన 1/హెల్లాస్ శాట్–4 జియోస్టేషనరీ శాటిలైట్‌ను ఏరియన్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ప్రయోగించిన 42 నిమిషాల్లోనే 2 ఉపగ్రహాలు అత్యంత సునాయాసంగా ముందుగా నిర్ణయించిన సమయానికే నిర్దేశిత కక్ష్యలో ప్రవేశించాయి. జీశాట్–31 ఉపగ్రహాన్ని పెరిజీ (భూమికి దగ్గరగా) 250 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 35,850 కిలోమీటర్ల ఎత్తులోని దీర్ఘ వృత్తాకార భూ బదిలీ కక్ష్యలో 3.0 డిగ్రీల కోణంలో విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. భూ బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాన్ని రెండు మూడు విడతల్లో భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కౌరునే ఎందుకు.. జూన్, జులైలో మరో జియోస్టేషనరీ శాటిలైట్ జీశాట్30ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తామని కౌరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.పాండియన్ చెప్పారు. ఫ్రెంచ్ గయానాతో భారత్‌కు 1981 నుంచి అంతరిక్ష సంబంధాలు కొనసాగుతున్నాయని, ఇవి క్రమంగా మరింత బలపడుతున్నాయన్నారు. ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్–2 ద్వారా ప్రయోగించే వీలున్నప్పటికీ ఇక్కడ చంద్రయాన్–2 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి వచ్చిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. బహుళ ప్రయోజనకారి.. సుమారు 2,536 కిలోలు బరువున్న ఈ అధునాతన ఉపగ్రహాన్ని ఇస్రో తయారుచేసింది. ఇందులో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం గల అత్యంత శక్తివంతమైన కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్ల వ్యవస్థను అమర్చారు. ఇది ఇన్శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఆధునిక రూపంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్శాట్–4సీఆర్, ఇన్శాట్–4ఏ సమాచార ఉపగ్రహాల కాలపరిమితి త్వరలో ముగియనుంది. ఈ రెండు ఉపగ్రహాల స్థానాన్ని కూడా జీశాట్–31 ఉపగ్రహం భర్తీ చేయనుంది. ఈ ఉపగ్రహం ముఖ్యంగా భారత భూభాగం, ద్వీపాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిసరాలను పర్యవేక్షించి తగిన సమాచారాన్ని అందించనుంది. దీని ద్వారా వీశాట్నెట్వర్క్స్, టెలివిజన్ అప్‌లింక్స్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్, సెల్యులార్ బ్యాకప్, డీటీహెచ్ టెలివిజన్ సర్వీసులు, స్టాక్ ఎక్చ్సేంజీ, ఈ–గవర్నెన్స్, ఏటీఎం సేవలన్నీ మెరుగుపడే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. నూతన టెలి కమ్యూనికేషన్ అప్లికేషన్లకు అవసరమైన సమాచారాన్ని పెద్దమొత్తంలో ట్రాన్స్ఫర్ ఇది చేయనుంది. -
ఇస్రో ‘బిగ్ బర్డ్’ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్–11 ప్రయోగం బుధవారం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్–5వీఏ246 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్–11ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బుధవారం తెల్లవారుజామున 2.07 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్ నింగికి దూసుకెళ్లగా 33 నిమిషాల్లో జీశాట్–11ను కక్ష్యలోకి చేర్చింది. 5,854 కిలోల బరువు ఉన్న జీశాట్–11, ఇప్పటివరకు ఇస్రో తయారు చేసిన అన్ని ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత బరువైనది. అందుకే దీనిని ‘బిగ్ బర్డ్’ (పెద్ద పక్షి) అని పిలుస్తున్నారు. భారత్‌కు అత్యంత ధనిక అంతరిక్ష ఆస్తిగా జీశాట్–11 ఉంటుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. జీశాట్–11 కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం (ఎంసీఎప్) శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఇస్రో చరిత్రలో జీశాట్ సిరీస్‌లో ఐదు టన్నుల పైబడి బరువు కలిగిన ఉపగ్రహాన్ని తయారు చేసి పంపించడం ఇదే మొదటి సారి. గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్లే ప్రస్తుతం ఇస్రో వద్ద ఉన్నాయి. అందుకే జీశాట్–11ను ఫ్రాన్స్ నుంచి ప్రయోగించారు. జీశాట్ సిరీస్‌లో ఇది 34వ ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. కొరియాకు చెందిన మరో ఉపగ్రహాన్ని కూడా ఇదే రాకెట్ ద్వారా ఏరియన్‌స్పేస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ బెంగళూరులో యూఆర్‌రావు శాటిలైట్ స్పేస్ సెంటర్లో సుమారు రూ.600 కోట్లు వ్యయంతో జీశాట్–11ను తయారు చేశారు. తొలుత ఈ ఏడాది మే 25న ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేసినప్పటికీ ఉపగ్రహంలోని లోపాలను రెండ్రోజుల ముందు గుర్తించడంతో ప్రయోగం వాయిదా పడింది. దీనిపై అధ్యయనం చేయగా ఈ ఉపగ్రహంలో జీశాట్ 6ఏలో ఉపయోగించిన సిగ్నల్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థలు వాడారని తేలింది. జీశాట్–11లో 40 కేయూ, కేఏ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లును అమర్చారు. ఈ ప్రయోగంతో 14 జిగాబైట్స్ ఇంటర్నెట్ ప్రీక్వెన్సీ అందుబాటులోకి రావడమే కాకుండా 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ 2019 చివరికల్లా కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందుకోసం తాజా జీశాట్–11తో కలిపి మూడు ఉపగ్రహాలను ఇప్పటికే అంతరిక్షంలోకి పంపామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందించాలనే ఉద్దేశంతో నాలుగు అతి పెద్ద సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–11 ప్రయోగంతో మూడు ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి పంపించామన్నారు. ఇందులో గతేడాది జూన్ 5న జీఎస్‌ఎఎల్‌వీ మార్క్3డీ1 ద్వారా జీశాట్–19, ఈ ఏడాది గత నెల 14న జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 ద్వారా జీశాట్–29ను ప్రయోగాలను స్వదేశీ రాకెట్లు ద్వారా ప్రయోగించిన విషయం తెలిసిందే. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడు రావాలంటే జీశాట్–20 అనే ఉపగ్రహం అవసరం ఉందని, దీన్ని 2019 సెప్టెంబర్‌లో ప్రయోగిస్తామన్నారు. -
వాయిదా పడిన జీశాట్–11 ప్రయోగం
బెంగళూరు: సమాచార ఉపగ్రహం జీశాట్–11 ప్రయోగం వాయిదా పడింది. మే 25న ఫ్రెంచ్ గయానాలోని కౌరు నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా అది వాయిదా పడినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహానికి మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రయోగాన్ని వాయిదా వేశామనీ, అంతరిక్షంలోకి ఎప్పుడు పంపుతామో త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో డైరెక్టర్ కె.శివన్ వెల్లడించారు. -
జీశాట్- 15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
ఫ్రెంచ్ గయానా: జీశాట్-15 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.04 గంటలకు జీశాట్-15ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అరైన్-5-వీఏ 227 అనే ఉపగ్రహ వాహకనౌక ద్వారా 3,164 కిలోలు బరువున్న జీశాట్-15తో పాటు అరబ్‌శాట్-6బీనూ రోదసిలోకి పంపారు. జీశాట్-15లో 24 కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్స్ , రెండు గగన్ పేలోడ్స్ (జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంట్ నావిగేషన్) అనే ఉపకరణాలను అమర్చి పంపారు.