కౌరూ: ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం శనివారం దిగ్విజయంగా ముగిసింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్‌లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకోవడంలో ఈ టెలిస్కోప్ కీలకపాత్ర పోషించనుంది. భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల పట్టవచ్చు.
అక్కడ కక్ష్యలోకి ప్రవేశించి సర్దుకొని పని ప్రారంభించేందుకు మరో 5 నెలలు పడుతుందని అంచనా. అంటే 6 నెలల అనంతరం(సుమారు 2022 జూన్ నాటికి) వెబ్ టెలిస్కోపు తన ఇన్‌ఫ్రారెడ్ నేత్రంతో చూసేవాటిని భూమికి పంపడం ఆరంభమవుతుంది. ఒక టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఈ టెలిస్కోపులో పలు దర్పణాలున్నాయి. దీన్ని ఒరిగామి(జపాన్‌లో కాగితాన్ని వివిధ ఆకృతుల్లోకి మడిచే కళ) పద్ధతిలో మడిచి రాకెట్ కొనభాగంలో జాగ్రత్త చేశారు. నిర్దేశిత స్థానం చేరేలోపు ఇది నెమ్మదిగా దానంతటదే విచ్చుకుంటాయి. ఖగోళ రహస్యాల గుట్టు విప్పేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇదే అత్యంత క్లిష్టమైందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు.
నాసా హర్షం
మన విశ్వాన్ని గురించి అందులో మన స్థానం గురించి మరింత అవగాహన కల్పించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగం విజయవంతం కావడంపై నాసా సంతోషం వ్యక్తం చేసింది. 1990నుంచి సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా భావిస్తున్న ఈ టెలిస్కోపుతో.. మనమెవరం? అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని బిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దీన్ని ఈ నెల 22న ప్రయోగించాల్సిఉండగా వివిధ కారణాలతో రెండు మార్లు వాయిదా పడి చివరకు క్రిస్మస్ రోజున నింగికెగిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీని ప్రయోగం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు లాంచింగ్ సమయం వచ్చేసరిగి లాంచింగ్ స్టేషన్ మొత్తం ఉద్విగ్నత వ్యాపించింది.
భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదున్నరకు ఏరియన్ రాకెట్ దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మానవాళి కోసమని ఏరియన్‌స్పేస్ సీఈఓ స్టీఫెన్ ఇస్రాయెల్ ఆనందం వ్యక్తం చేశారు. టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశించాక మనం ఆకాశాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. మరో మూడు రోజుల ప్రయాణం అనంతరం టెలిస్కోపులోని సన్ షీల్డ్ తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకునేందుకు 5 రోజులు పడుతుంది. అనంతరం 12 రోజుల పాటు మిర్రర్ సెగ్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో తెరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా జరిగేలా చూడడానికి వందలమంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు.
జేమ్స్ వెబ్ విశేషాలు...
► దాదాపు 16లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ స్థానం వద్దకు చేరుతుంది.
► సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టే సామర్ధ్యం దీని సొంతం.
► బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ అంశాల పరిశీలన దీని ముఖ్య లక్ష్యం.
► దీని తయారీలో దాదాపు 10వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్లగంటల పాటు పనిచేశారు.
► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసాకు చెందిన దాదాపు 20కి పైగా దేశాలకు దీనిలో భాగస్వామ్యముంది.
► 50 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఆరంభించిన ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 966 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది.
► 1996లో ఆరంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పాతికేళ్లు పట్టింది.
► దీని సైజు 72గీ39 అడుగులు. బరువు 6 టన్నులు. కనీసం పదేళ్లు పనిచేస్తుంది.
► దీనిలో బంగారు పూత పూసిన 6.5 మీటర్ల వ్యాసమున్న 18 షట్కోణ ఫలకాల దర్పణం ఉంది.
► 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను ఈ దర్పణం గమనించగలదు.
► సూర్యకాంతిలో మండిపోకుండా –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియం సౌర కవచం అమర్చారు.
► కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు.
► ఎల్2 వద్దకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో పనిప్రారంభించడానికి ఐదు నెలలు పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment