Ariane-5
-
విను వీధిలోకి వెబ్ టెలిస్కోప్!
కౌరూ: ప్రపంచంలోనే భారీ, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం శనివారం దిగ్విజయంగా ముగిసింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్–5 రాకెట్లో దీన్ని నింగిలోకి పంపారు. విశ్వ ఆవిర్భావం నాటి తొలి నక్షత్రాల గుట్టును, ఖగోళ ప్రపంచం రహస్యాలను తెలుసుకోవడంలో ఈ టెలిస్కోప్ కీలకపాత్ర పోషించనుంది. భూమి నుంచి 16 లక్షల కిలోమీటర్లు పయనించిన అనంతరం టెలిస్కోపు నిర్దేశిత స్థానానికి చేరుకుంటుంది. ఈ మొత్తం దూరం పయనించేందుకు సుమారు నెల పట్టవచ్చు. అక్కడ కక్ష్యలోకి ప్రవేశించి సర్దుకొని పని ప్రారంభించేందుకు మరో 5 నెలలు పడుతుందని అంచనా. అంటే 6 నెలల అనంతరం(సుమారు 2022 జూన్ నాటికి) వెబ్ టెలిస్కోపు తన ఇన్ఫ్రారెడ్ నేత్రంతో చూసేవాటిని భూమికి పంపడం ఆరంభమవుతుంది. ఒక టెన్నిస్ కోర్ట్ విస్తీర్ణంలో ఈ టెలిస్కోపులో పలు దర్పణాలున్నాయి. దీన్ని ఒరిగామి(జపాన్‌లో కాగితాన్ని వివిధ ఆకృతుల్లోకి మడిచే కళ) పద్ధతిలో మడిచి రాకెట్ కొనభాగంలో జాగ్రత్త చేశారు. నిర్దేశిత స్థానం చేరేలోపు ఇది నెమ్మదిగా దానంతటదే విచ్చుకుంటాయి. ఖగోళ రహస్యాల గుట్టు విప్పేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇదే అత్యంత క్లిష్టమైందని నాసా శాస్త్రవేత్తలు అన్నారు. నాసా హర్షం మన విశ్వాన్ని గురించి అందులో మన స్థానం గురించి మరింత అవగాహన కల్పించేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని నాసా అడ్మిన్ బిల్ నెల్సన్ అభిప్రాయపడ్డారు. ప్రయోగం విజయవంతం కావడంపై నాసా సంతోషం వ్యక్తం చేసింది. 1990నుంచి సేవలందిస్తున్న హబుల్ టెలిస్కోపుకు వారసురాలిగా భావిస్తున్న ఈ టెలిస్కోపుతో.. మనమెవరం? అన్న ప్రశ్నకు సమాధానం దొరకవచ్చని బిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి దీన్ని ఈ నెల 22న ప్రయోగించాల్సిఉండగా వివిధ కారణాలతో రెండు మార్లు వాయిదా పడి చివరకు క్రిస్మస్ రోజున నింగికెగిసింది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీని ప్రయోగం కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు లాంచింగ్ సమయం వచ్చేసరిగి లాంచింగ్ స్టేషన్ మొత్తం ఉద్విగ్నత వ్యాపించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదున్నరకు ఏరియన్ రాకెట్ దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం మానవాళి కోసమని ఏరియన్‌స్పేస్ సీఈఓ స్టీఫెన్ ఇస్రాయెల్ ఆనందం వ్యక్తం చేశారు. టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశించాక మనం ఆకాశాన్ని చూసే దృక్పథం మారుతుందన్నారు. మరో మూడు రోజుల ప్రయాణం అనంతరం టెలిస్కోపులోని సన్ షీల్డ్ తెరుచుకుంటుంది. ఇది పూర్తిగా తెరుచుకునేందుకు 5 రోజులు పడుతుంది. అనంతరం 12 రోజుల పాటు మిర్రర్ సెగ్మెంట్లు ఒక క్రమ పద్ధతిలో తెరుచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ సరిగ్గా జరిగేలా చూడడానికి వందలమంది శాస్త్రవేత్తలు అనుక్షణం అప్రమత్తంగా పని చేస్తున్నారు. జేమ్స్ వెబ్ విశేషాలు... ► దాదాపు 16లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం భూమి– సూర్యుల మధ్య ఉన్న ఎల్2 లాంగ్రేజియన్ స్థానం వద్దకు చేరుతుంది. ► సుమారు 1350 కోట్ల సంవత్సరాల పూర్వపు కాంతిని పసిగట్టే సామర్ధ్యం దీని సొంతం. ► బిగ్‌బ్యాంగ్ అనంతర పరిణామాలు, గెలాక్సీల పుట్టుక, విశ్వ ఆవిర్భావ అంశాల పరిశీలన దీని ముఖ్య లక్ష్యం. ► దీని తయారీలో దాదాపు 10వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్లగంటల పాటు పనిచేశారు. ► యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ, నాసాకు చెందిన దాదాపు 20కి పైగా దేశాలకు దీనిలో భాగస్వామ్యముంది. ► 50 కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో ఆరంభించిన ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 966 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది. ► 1996లో ఆరంభమైన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి పాతికేళ్లు పట్టింది. ► దీని సైజు 72గీ39 అడుగులు. బరువు 6 టన్నులు. కనీసం పదేళ్లు పనిచేస్తుంది. ► దీనిలో బంగారు పూత పూసిన 6.5 మీటర్ల వ్యాసమున్న 18 షట్కోణ ఫలకాల దర్పణం ఉంది. ► 0.6– 28.3ఎం వరకు ఉన్న కాంతి కిరణాలను ఈ దర్పణం గమనించగలదు. ► సూర్యకాంతిలో మండిపోకుండా –220 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లగా ఉంచేందుకు సిలికాన్, అల్యూమినియం సౌర కవచం అమర్చారు. ► కక్ష్యలోకి చేరాక ఇది రోజుకు 458 గిగాబైట్ల డేటాను పదేళ్ల పాటు పంపగలదు. ► ఎల్2 వద్దకు చేరిన తర్వాత పూర్తిస్థాయిలో పనిప్రారంభించడానికి ఐదు నెలలు పడుతుంది. -
టాటా స్కై కోసం అంతరిక్షంలోకి జిశాట్-24 కమ్యూనికేషన్ శాటిలైట్
యూరోపియన్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఏరియన్ స్పేస్'కు చెందిన ఏరియన్-5 రాకెట్ ద్వారా నాలుగు టన్నుల జీశాట్-24 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ప్రభుత్వ రంగ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) నిర్ణయించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్మించిన ఈ నాలుగు టన్నుల క్లాస్ కమ్యూనికేషన్-బ్యాండ్ ఉపగ్రహాన్ని ఏరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఎన్ఎస్ఐఎల్ చేత తయారు చేయబడిన పూర్తి స్థాయి జీశాట్-24 ఉపగ్రహాన్ని 2022 మొదటి త్రైమాసికంలో ప్రయోగించాలని భావిస్తున్నారు. డిటిహెచ్ అప్లికేషన్ అవసరాలను తీర్చడం కోసం మొత్తం జిశాట్-24 ఉపగ్రహాన్ని టాటా స్కైకి లీజుకు ఇచ్చారు. జిశాట్-24 ఉపగ్రహాన్ని ఎన్ఎస్ఐఎల్ వాణిజ్య ప్రాతిపదికన స్వంతం చేసుకుని నడుపుతుంది. గతంలో అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఛైర్మన్ కె. శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో తయారు చేసిన జిశాట్ 20, జిశాట్ 22, జిశాట్ 24 అనే మూడు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఎన్ఎస్ఐఎల్ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఇస్రో తయారు చేసిన ఉపగ్రహాలను కొనుగోలు చేయడమే కాకుండా వాటిని లీజుకు తీసుకోవచ్చు. (చదవండి: లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం) ప్రభుత్వ రంగ అంతరిక్ష వాణిజ్య సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) ఉపగ్రహాలు, వాహక నౌకల తయారీ కోసం పెట్టుబడుల పెడుతుంది. వచ్చే అయిదేళ్లలో రూ.10 వేల కోట్ల వ్యయంతో తమదైన సొంత వాహక నౌకలను తయారు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ జి.నారాయణన్ బెంగళూరులో ప్రకటించారు. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సైతం కొనుగోలు/లీజుకు తీసుకుంటుంది. వచ్చే ఏడాది డీటీహెచ్(టాటా స్కై), బ్రాడ్ బ్యాండ్ సంస్థలకు చెందిన రెండు ఉపగ్రహాలను వచ్చే ఏడాది ప్రయోగిస్తామన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 342 సంస్థలు ఎన్ఎస్ఐఎల్తో ఒప్పందాలు కుదుర్చుకోగా వాటిల్లో అత్యధిక సంస్థలు అమెరికాకు చెందినవని నారాయణ్ తెలిపారు. -
ఇస్రో ‘జీశాట్-30’ శాటిలైట్ ప్రయోగం సక్సెస్..
బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన జీశాట్-30 శాటిలైట్ ప్రయోగం విజయవంతమైంది. టెలివిజన్ ప్రసారాలు, టెలీకమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్‌కు సంబంధించి మరింత నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఫ్రెంచ్ భుభాగంలోని కౌరు నుంచి భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఈ ప్రయోగం జరిగిందని ఇస్రో తెలిపింది. ఏరియన్ 5 వాహక నౌక జీశాట్-30 ఉపగ్రహాన్ని 38 నిమిషాల్లో కక్ష్యలో ప్రవేశపెట్టిందని ఇస్రో వెల్లడించింది. 3,357 కిలోల బరువున్న జీశాట్-30 ఉపగ్రహం.. చాలా కాలం నుంచి సేవలు అందిస్తున్న ఇన్ శాట్-4ఏ ఉపగ్రహం స్థానాన్ని భర్తీ చేయనుంది. -
ఇస్రో ‘బిగ్ బర్డ్’ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చరిత్రలోనే అత్యంత భారీ ఉపగ్రహమైన జీశాట్–11 ప్రయోగం బుధవారం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌స్పేస్ సంస్థకు చెందిన ఏరియన్–5వీఏ246 ఉపగ్రహ వాహకనౌక ద్వారా జీశాట్–11ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బుధవారం తెల్లవారుజామున 2.07 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్ నింగికి దూసుకెళ్లగా 33 నిమిషాల్లో జీశాట్–11ను కక్ష్యలోకి చేర్చింది. 5,854 కిలోల బరువు ఉన్న జీశాట్–11, ఇప్పటివరకు ఇస్రో తయారు చేసిన అన్ని ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత బరువైనది. అందుకే దీనిని ‘బిగ్ బర్డ్’ (పెద్ద పక్షి) అని పిలుస్తున్నారు. భారత్‌కు అత్యంత ధనిక అంతరిక్ష ఆస్తిగా జీశాట్–11 ఉంటుందని ఇస్రో చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. జీశాట్–11 కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని హసన్‌లో ఉన్న ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం (ఎంసీఎప్) శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని అంతా సవ్యంగా ఉందని ప్రకటించారు. ఇస్రో చరిత్రలో జీశాట్ సిరీస్‌లో ఐదు టన్నుల పైబడి బరువు కలిగిన ఉపగ్రహాన్ని తయారు చేసి పంపించడం ఇదే మొదటి సారి. గరిష్టంగా నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపగలిగే సామర్థ్యం ఉన్న రాకెట్లే ప్రస్తుతం ఇస్రో వద్ద ఉన్నాయి. అందుకే జీశాట్–11ను ఫ్రాన్స్ నుంచి ప్రయోగించారు. జీశాట్ సిరీస్‌లో ఇది 34వ ఉపగ్రహం కావడం విశేషం. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. కొరియాకు చెందిన మరో ఉపగ్రహాన్ని కూడా ఇదే రాకెట్ ద్వారా ఏరియన్‌స్పేస్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ బెంగళూరులో యూఆర్‌రావు శాటిలైట్ స్పేస్ సెంటర్లో సుమారు రూ.600 కోట్లు వ్యయంతో జీశాట్–11ను తయారు చేశారు. తొలుత ఈ ఏడాది మే 25న ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేసినప్పటికీ ఉపగ్రహంలోని లోపాలను రెండ్రోజుల ముందు గుర్తించడంతో ప్రయోగం వాయిదా పడింది. దీనిపై అధ్యయనం చేయగా ఈ ఉపగ్రహంలో జీశాట్ 6ఏలో ఉపయోగించిన సిగ్నల్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థలు వాడారని తేలింది. జీశాట్–11లో 40 కేయూ, కేఏ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్లును అమర్చారు. ఈ ప్రయోగంతో 14 జిగాబైట్స్ ఇంటర్నెట్ ప్రీక్వెన్సీ అందుబాటులోకి రావడమే కాకుండా 16 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుంది. కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ 2019 చివరికల్లా కుగ్రామాలకూ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, అందుకోసం తాజా జీశాట్–11తో కలిపి మూడు ఉపగ్రహాలను ఇప్పటికే అంతరిక్షంలోకి పంపామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ అందించాలనే ఉద్దేశంతో నాలుగు అతి పెద్ద సమాచార ఉపగ్రహాల్లో జీశాట్–11 ప్రయోగంతో మూడు ఉపగ్రహాలను భూస్థిర కక్ష్యలోకి పంపించామన్నారు. ఇందులో గతేడాది జూన్ 5న జీఎస్‌ఎఎల్‌వీ మార్క్3డీ1 ద్వారా జీశాట్–19, ఈ ఏడాది గత నెల 14న జీఎస్ఎల్వీ మార్క్3–డీ2 ద్వారా జీశాట్–29ను ప్రయోగాలను స్వదేశీ రాకెట్లు ద్వారా ప్రయోగించిన విషయం తెలిసిందే. 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడు రావాలంటే జీశాట్–20 అనే ఉపగ్రహం అవసరం ఉందని, దీన్ని 2019 సెప్టెంబర్‌లో ప్రయోగిస్తామన్నారు. -
జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
-
జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
గయానా: జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 2 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్‌ను పంపించారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. ప్రయోగం పూర్తి అవ్వడంతో బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది. జీశాట్-18 ఉపగ్రహంతో ఉపయోగాలు: దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది. జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్ఫాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది.