జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
గయానా: జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 2 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ231 రాకెట్ ద్వారా 3,404 కిలోల బరువు కలిగిన జీశాట్-18 ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఈ ఉపగ్రహంలో 24 సీ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 12 ఎక్సెంటెడ్ సీ బాండ్, 12 కేయూ బాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, 2 కేయూ బీకాన్ బాండ్ ట్రాన్స్ ఫాండర్స్‌ను పంపించారు. ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు సేవలందిస్తుంది. ప్రయోగం నిమిత్తం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, శాటిలైట్ డెరైక్టర్ సూర్యప్రకాశ్‌రావు ఫ్రాన్స్‌లోనే ఉన్నారు. ప్రయోగం పూర్తి అవ్వడంతో బెంగళూరులోని హాసన్ మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఉపగ్రహాన్ని అదుపులోకి తీసుకుని నియంత్రిస్తుంది.
జీశాట్-18 ఉపగ్రహంతో ఉపయోగాలు: దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని జీశాట్-18 అందుబాటులోకి తెస్తుంది. జీశాట్-18 ద్వారా అందుబాటు లోకి రానున్న 50 ట్రాన్స్‌ఫాండర్లతో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో ప్రకటించింది.