James Webb Telescope: కొత్త ప్రపంచాలకు కిటికీ | NASA Images From The James Webb Space Telescope | Sakshi
Sakshi News home page

జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ కొత్త ప్రపంచాలకు కిటికీ

Published Sun, Nov 27 2022 12:46 AM | Last Updated on Sun, Nov 27 2022 12:46 AM

NASA Images From The James Webb Space Telescope - Sakshi

జేమ్స్‌ వెబ్‌స్పేస్‌ టెలిస్కోప్‌ 2022 జూలై నెలలో అంతరిక్షంలో అంతకుముందు అందని లోతుల చిత్రాలను పంపించింది. అందరూ ఆ దృశ్యాలను చూసి ఆనందించారు. చిత్రాలతోబాటే అప్పట్లో ఒక గ్రాఫ్‌ను కూడా ప్రకటించారు. అటువంటి వాటిని ఎవరూ పట్టించుకోకపోవడం మామూలే. ఆస్ట్రాన మర్‌లు మాత్రం ఆ వంకర గీతను చూచి అవాక్కయినట్టు తరువాత తెలిసింది. మన గ్రహం మీద కాక మరెక్కడయినా జీవం కొరకు జరుగుతున్న వెదుకు లాటలో ఈ గీత ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది.
ఎక్కడో మారుమూలన దాగి ఉన్న వాస్ప్‌ 96 బి అనే ఒక గ్రహం చుట్టూ వాతావరణంలో నీటి ఆవిరి ఉన్నట్టు ఈ గ్రాఫ్‌ ఆధారంగా అర్థమయింది. అసలు జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ వల్ల అవుతుంది అని ఎవరూ ఊహించని సమాచారాన్ని అది అందిస్తున్నది అంటున్నారు పరిశోధకులు. సుదూర ప్రాంతాల గ్రహాల చుట్టూ గల వాతావరణాల సంగతులను టెలిస్కోప్‌ తెలియజేస్తున్నదని అర్థం. కనిపించిన దృశ్యాల అందం కన్నా పరిశోధకులకు ఈ సమాచారం మరింత ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. కనుకనే వారంతా గ్రాఫ్‌ గురించి మరింత పరిశోధనలకు పూనుకున్నారు. అంతకుముందెన్నడూ లేనంత వివరంగా, అజ్ఞాత ప్రపంచాల వాతావరణ సంగతులు తెలుసుకుంటు న్నారు. అక్కడెక్కడయినా జీవం ఉంటేగింటే, వివరాలు తెలుసుకునే వీలు మాత్రం అందింది అంటున్నారు. అట్లాగని జీవం ఆనుపానులు దొరికినట్టే అనుకునే పద్ధతి సరికాదని మనకు తెలుసు.

గతంలో 2022లోనే హబుల్‌ టెలిస్కోప్‌ ఆధారంగా ఇటువంటి పరిశీలనలు సాగినాయి. కొత్త టెలిస్కోప్‌ హబుల్‌ కన్నా బలం గలది గనుక ఈసారి పరిశీలనలు మరింత బాగా సాగుతాయి. పరిశీలిం చదగిన గ్రహాలను ఇప్పటికే గుర్తించేశారు కూడా. జీవం ఉనికి పరిశోధన మరింత బాగా కొనసాగుతున్నది. ‘గొప్ప ప్రయత్నం మరో సారి బలపడి ముందుకు జరిగే సందర్భం ఇది’ అన్నారు జర్మనీ పరిశోధకురాలు లారా క్రెయిడ్‌బెర్గ్‌ ఈ మధ్యన. కొంతకాలంగా సుదూర గ్రహాల వాతావరణంలోని మూలకాలు, రసాయన సమ్మేళనాల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రయత్నాలలో దుర్భిణీ యంత్రాల పాత్ర అందరికీ అర్థమయింది. ఇక జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ కారణంగా, మరింత లోతుగా అక్కడి వాతావరణాలలోకి చూడగలుగుతున్నారు. అందుకు ముఖ్యంగా మూడు కారణాలు ఆధారంగా నిలిచి వీలు కలిగిస్తున్నాయి. ఈ టెలిస్కోప్‌ భూమి నుంచి చాలా దూరంలో ఉంది. గమ్యాలను నిశ్చలంగా, నిశితంగా గమనించి ఎక్కువ లోతైన వివరాలను సేకరించగలుగుతుంది. తక్కువ బలంగల సంకేతాలను గూడా అది గుర్తించ గలుగుతుంది. ఈ టెలిస్కోప్‌లోని అద్దం డయామీటర్‌ 6.5 మీటర్లు. హబుల్‌ అద్దం 2.4 మీటర్లు మాత్రమే. అంటే కొత్త టెలిస్కోప్‌ ఎక్కువ కాంతిని, మరీ చిన్న వివరాలను కూడా చూడగలదు. ఇక ఇన్‌ఫ్రారెడ్‌ వర్ణపటం మొత్తాల్ని జేమ్స్‌ వెబ్‌ పరిశీలించగలుగుతుంది అన్నది మూడవ అంశం. అంటే గ్రహాల వాతావరణాలలోని రసాయనాల వివరాలు మరింతగా అర్థం అవుతాయి.

ఒక నక్షత్రం చుట్టూ, సూర్య గోళం చుట్టూ మన భూగ్రహంలాగే తిరుగుతున్న గ్రహాలను మరింత బాగా పరిశీలించి జీవం ఉనికి నిర్ధారించడం సులభంగా వీలవుతుందని తేలిపోయింది. ఈ గమ్యం కొరకు పరిశీలించ వలసిన మరో రెండు మూడు సుదూర గ్రహాలు ఈ పట్టికలో ఉన్నాయి. ఇవన్నీ తమ తమ నక్షత్రాల చుట్టూ, జీవం ఉండ గల దూరాలలో తిరుగుతున్నాయి. వాటి మీద నీరు ఉండే వీలు ఉందని అర్థం. అయితే అవన్నీ భూమికన్నా చిన్నవి అయితే, వాటి వాతావరణం కూడా తక్కువగా ఉంటుంది. అవి తిరుగుతున్న నక్షత్రాలు కూడా సూర్య గోళానికి సమంగా వేడి గలవి కావు. భూమి నుంచి నలభై కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ట్రాపిస్ట్‌ గ్రహాలు, తమ నక్షత్రాలకు మరీ దగ్గరగా ఉన్నాయి. ఆ నక్షత్రాలు చల్లగా ఉన్నాయి. అంటే సూర్యునితో పోలిస్తే, అంత వేడిగలవి కావు. 

మనమిప్పుడు ఆక్సిజన్‌ పీల్చి బతుకుతున్నాము. కానీ భూమి మీద మొదట్లో ఉన్న జీవులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా శక్తిని సిద్ధం చేసుకుని ఆక్సిజన్‌ను, ఇప్పటి మొక్కల్లాగే వదిలిపెట్టేవి. ఆ వాయువును వాడుకుని బతికే జీవులు, ఆ తరువాత వచ్చాయి. మొత్తానికి సుదూర గ్రహాల వాతావరణంలో ఆక్సిజన్, మీథేన్‌ ఉన్నట్టు తెలిస్తే, అక్కడ జీవం ఉన్నదని సూచన అనుకోవచ్చు. జీవులుంటేనే ఈ వాయువులుంటాయి. ‘అనుకోని చోట, జీవం సంకేతాలు కనబడితే, అంతకన్నా ఆశ్చర్యం లేదు’ అంటారు పరిశోధకులు డెమింగ్‌.

నిజానికి ఈ పరిశోధన కొత్త దారులు తొక్కుతున్నది. మరిన్ని రకాల రసాయనాల ఆధారంగా జీవం ఉనికిని గుర్తించవచ్చు. జేమ్స్‌ వెబ్‌తో ఈ అవకాశం పెరుగుతున్నది. త్వరలోనే ఆశ్చర్యకరమైన సంగతులు తెలిసే అవకాశం ఉంది. విశ్వంలో మనకు తోడుగా మరె క్కడా జీవులు లేవా? లేరా? అన్న ప్రశ్నకు జవాబు దొరుకుతుందేమో! ఓపికగా ఎదురుచూడటం ఒకటే దారి.


కె.బి. గోపాలం, వ్యాసకర్త రచయిత, అనువాదకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement