'ముస్లిం మహిళలకు మేం వడ్డించం'
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివార్లలో ఉన్న ఓ రెస్టారెంటు ఇద్దరు ముస్లిం మహిళలకు వడ్డించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆగ్రహావేశాలు వెల్లువెత్తి నిరసనలకు దారితీసింది. ''ఉగ్రవాదులు ముస్లింలు, ముస్లింలంతా ఉగ్రవాదులు'' అని బురఖాలలో వచ్చిన ఇద్దరు మహిళలకు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్రెంబ్లే ప్రాంతంలోని లీ సెనాకిల్ రెస్టారెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో తమ రెస్టారెంటు ముందు గుమిగూడిన వారికి రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది.
ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే తాను కూడా ఆందోళన చెందానని, ఫ్రెంచి బీచ్లలో బుర్కినీలు వేసుకున్న మహిళల గురించి జరుగుతున్న వివాదాలు కూడా అందుకు కారణమని రెస్టారెంటు యజమాని చెప్పారు. గత నవంబర్లో బాటాక్లాన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఉగ్రదాడిలో తన స్నేహితుడు ఒకరు మరణించారని, దాని ప్రభావం కూడా తనపై ఉందని తెలిపారు. జాతి వివక్ష ఉన్న వ్యక్తులు పెడితే తాము తినబోమని ఆ మహిళల్లో ఒకరు చెప్పగా, జాతివివక్ష ఉన్నవాళ్లు ప్రజలను చంపరని రెస్టారెంటు యజమాని వారికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి వివాదాలను తాము సహించబోమని, దీనిపై విచారణకు ఆదేశించామని ఫ్రెంచి మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ చెప్పారు.