ఎట్టకేలకు వెయ్యిమంది కదిలారు
జమ్మూ: ఎట్టకేలకు మరోసారి అమర్ నాథ్ యాత్ర ముందుకు సాగుతోంది. శాంతిభద్రతలు పర్యవేక్షించిన పోలీసులు జమ్మూ నుంచి ప్రస్తుతం 1000మంది యాత్రికులను అనుమతించారు. గత కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఆందోళన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వేలమంది అమర్ నాథ్ యాత్రికులు జమ్మూలో నిలిచిపోయారు.
అరకొర వసతులతో నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన పోలీసులు, అధికారులు కొంత పరిస్థితి మెరుగైందనే నిర్ణయానికి వచ్చి 731మంది పురుషులను, 219 మంది మహిళలను 50 మంది సాధువులను అనుమతించారు. వీరంతా 29 వాహనాల్లో పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపులకు జమ్మూలోని భగవతి నగర్ నుంచి బయల్దేరారు.