2020 నాటికి రూ.50 వేల కోట్ల టర్నోవర్
అమూల్ లక్ష్యం
విస్తరణకు రూ.5,000 కోట్ల వ్యయం
జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్ఎస్ సోధి
హైదరాబాద్ పాల మార్కెట్లోకి ప్రవేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) హైదరాబాద్ మార్కెట్లో తాజా పాలను శుక్రవారం ప్రవేశపెట్టింది. తద్వారా ఈ విభాగంలో కంపెనీ దక్షిణాది మార్కెట్లో అడుగుపెట్టినట్టయింది. లీటరు ధర టోన్డ్ పాలు రూ.38, ఫుల్ క్రీమ్ పాలు రూ.50 ఉంది. విజయ బ్రాండ్‌కు హాని తలపెట్టకూడదనే ఉద్ధేశంతోనే ఈ ధర నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అమూల్‌కు కావాల్సిన పాలను నల్గొండ-రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్మాక్) అందిస్తుంది. కొద్ది రోజులపాటు గుజరాత్ నుంచి పాలను ఇక్కడికి తెప్పిస్తారు. అమూల్ రోజుకు 100 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది.
రెండేళ్లలో 25 శాతం..
హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. 20 వరకు బ్రాండ్లున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భాగ్యనగరంలో లీటరుకు రూ.6-10 ధర అధికంగా ఉంది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల కారణంగానే పరిస్థితి ఇలా ఉందని జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఇటువంటి వ్యవస్థకు చెక్‌పెడుతూ వినియోగదార్లకు తక్కువ ధరలో నాణ్యమైన పాలను అందిస్తామని చెప్పారు. నార్మాక్ చైర్మన్ జి.జితేందర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
45 శాతం ఫ్రెష్ మిల్క్ నుంచే..
కంపెనీ ఆదాయంలో తాజా పాల వాటా 45 శాతం కైవసం చేసుకుంది. జీసీఎంఎంఎఫ్ 2020 నాటికి రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. 2013-14లో టర్నోవర్ రూ.18,160 కోట్లుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22 వేల కోట్లు దాటతామని ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఏటా 24 శాతం వృద్ధి కనబరుస్తున్నట్టు వెల్లడించారు. హయత్‌నగర్ వద్ద ఉన్న నార్మాక్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 3 లక్షల లీటర్లు. మరో లక్ష లీటర్లను జోడించొచ్చు. కాగా, పాల మార్కెట్ ప్రపంచంలో 1.5 శాతం, భారత్‌లో 4.5 శాతం వృద్ధి చెందుతోంది. భారత్‌లో సగటు పాల వినియోగం 1970లో 112 గ్రాములు నమోదైంది. ప్రస్తుతం ఇది 310 గ్రాములకు ఎగసింది.
భారీ విస్తరణ..
కంపెనీకి రోజుకు 2.3 కోట్ల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీనిని రెండేళ్లలో 3.2 కోట్ల లీటర్లకు చేర్చనున్నారు. విస్తరణకు కంపెనీ మూడేళ్లలో రూ.4-5 వేల కోట్లను వ్యయం చేయనుంది. 80 దేశాలకు పాలు, పాల ఉత్పత్తులను జీసీఎంఎంఎఫ్ ఎగుమతి చేస్తోంది.