Freshwater pipeline
-
ఏపీకి తరలిపోయిన ‘రైల్ నీర్’
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలన్న లక్ష్యంతో రూపొందిన రైల్ నీర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయింది. ఐదువేల మందికి ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధినివ్వగలిగే ఈ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేం దుకు 2012లోనే సన్నాహాలు మొదల య్యాయి. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వ ర్యంలో రూ. 50 కోట్లకు పైగా అంచనాలతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటివరకూ భూమిని, వనరులను కేటా యించలేదు. దాంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఏపీకి తరలి వెళ్లింది. నూజివీడు దగ్గర దీన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ఐఆర్సీ టీసీకి ఎకరం భూమిని కేటాయించింది. దీంతో నగరంలో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్నట్టే అయింది. స్వచ్ఛమైన మంచినీరే లక్ష్యం.. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు, 26 ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. నిత్యం వందలాది రైళ్లు నడుస్తాయి. దక్షిణమధ్య రైల్వేలోనే సికింద్రాబాద్ అతిపెద్ద రైల్వేస్టేషన్. ఇలాంటి పెద్ద స్టేషన్లో కూడా ప్రయాణికులకు తాగునీటిని అందజేసేందుకు రైల్వేకు ఎలాంటి సొంత ఏర్పాట్లూ లేవు. దీంతో ప్రయాణికులు అధిక ధర వెచ్చించి ప్రైవేటు మినరల్ వాటర్‌నే కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ధరలో మినరల్ వాటర్‌ను అందజేసే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఐఆర్సీటీసీ ముందుకొచ్చింది. రోజుకు లక్ష లీటర్ల మంచినీటిని శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు చేస్తామని 2012లోనే అప్పటి ఉమ్మడి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఫ్యాబ్ సిటీ వద్ద ఏర్పాటుకు ప్రతిపాదన ఫ్యాబ్ సిటీ వద్ద 4 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు మంచినీటి పైపులైన్ కూడా ఏర్పాటు చేయాలని ఐఆర్సీటీసీ కోరింది. దీనికి అప్పటి ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. కానీ ఆ తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఫ్యాబ్ సిటీ వద్ద ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రోజుకు అక్కడి నుంచి రైల్వే స్టేషన్లకు, రైళ్లకు వాటర్ బాటిళ్లను సరఫరా చేసేందుకు రవాణా వ్యవస్థ, సిబ్బంది అవసరమయ్యేవారు. వాటర్ బాటిళ్ల విక్రయంపైనా పలువురు ఉపాధి పొందే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టును పలుమార్లు రైల్వే బడ్జెట్లో కూడా ప్రతిపాదించారు. కానీ దక్షిణమధ్య రైల్వే ఉదాసీనత, ప్రభుత్వ నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల లేమి తదితర కారణాల రీత్యా ఆ ప్రాజెక్టు ఏపీకి వెళ్లిపోయింది. ఇప్పటికైనా స్థలమిస్తే.. ఇటీవల రైల్ నిలయంలో జరిగిన సమావేశంలోనూ పలువురు ఎంపీలు రైల్ నీర్ ప్రాజెక్టును నిర్మించాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరారు. ఈ అంశంపై రైల్వేబోర్డు సమావేశంలో చర్చించనున్నట్లు జీఎం స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూమిని, ఇతర వసరులను సమకూరిస్తే హైదరాబాద్‌లో మరో ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కృష్ణ...కృష్ణా!
నగర తాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన కృష్ణా జలాలను చెరువులోకి మళ్లిస్తున్నారు. నిపుణులు, అధికారుల సూచనలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజాప్రతినిధులు అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్‌కు తరలిస్తున్న ఒక మంచినీటి పైప్‌లైన్ కవర్‌ను తొలగించి, గత నాలుగు రోజులుగా స్థానిక ప్రజాప్రతినిధులే ఇబ్రహీంపట్నం చెరువులోకి కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. దీంతో నగర అవసరాలకు వినియోగించే నీటిలో భారీకోత పడే అవకాశాలున్నాయి. - కృష్ణా జలాలకు ‘పట్నం’లో భారీ గండి - శుద్ధిచేసిన జలాలతో ఇబ్రహీంపట్నం చెరువును నింపుతున్న వైనం.. - నగర తాగునీటి అవసరాలకు భారీగా కోత... - అధికారుల సూచనలనూ బేఖాతరు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు? సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి తరలిస్తున్న కృష్ణా జలాలకు భారీగా గండిపడింది. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్‌కు తరలిస్తున్న ఒక మంచినీటి పైప్‌లైన్‌కు అత్యవసర మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన కవర్‌ను కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు తొలగించారు. అక్కడే చిన్న కాల్వను ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నం చె రువులోకి కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. దీంతో నగర తాగునీటి అవసరాలకు కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోదండాపూర్‌లో శుద్ధిచేసిన కృష్ణా జలాలతో సుమారు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పట్నం చెరువులోకి నాలుగు రోజులుగా నీటిని వదులుతుండడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి వెయ్యి లీటర్ల కృష్ణా నీటిని రూ.30 ఖర్చుచేసి జలమండలి శుద్ధిచేస్తున్న విషయం విదితమే. ఈ విలువైన తాగునీటిని వృథాగా చెరువులోకి వదులుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిక్విడ్ క్లోరిన్ కలిసిన ఈ నీటిని పెద్ద మొత్తంలో చెరువులో నింపుతుండడంతో ఇబ్రహీం పట్నం చెరువు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితం అవడంతోపాటు,చెరువులో చేపలు, జంతు, వృక్ష ఫ్లవకాలు మనుగడ సాగించడం కష్టసాధ్యమౌతుందని పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్ శుద్ధిచేయని(రా వాటర్) కృష్ణా జలాలతో ఇబ్రహీంపట్నం చెరువును నింపుతామని ఇటీవల హామీ ఇచ్చినప్పటికీ..పట్నం చెరువులోకి కృష్ణా రా వాటర్‌ను తరలించేందుకు అవసరమైన పైప్‌లై న్లు, కాలువలు అందుబాటులో లేవు. ఇదే తరుణంలో స్థానిక ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో నగరానికి తాగునీటిని సరఫరా చేసే పైప్లైన్కున్న కవర్‌ను తొలగించి నాలుగురోజుల క్రితం చెరువులోకి మళ్లించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో జలమండలి అధికారులు చేసిన సలహాలు, సూచనలను సైతం సదరు ప్రజాప్రతినిధులు బేఖాతరు చేయడం గమనార్హం. 45 రోజుల నగర తాగునీటి అవసరాలకు కోత సుమారు ఒక టీఎంసీ నీటిని 1200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువులోకి నింపిన పక్షంలో 45 రోజులపాటు నగర తాగునీటి అవసరాలకుసరిపడే తాగునీటిని కోల్పోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే కృష్ణా ఒకటి, రెండు, మూడవ దశల ద్వారా జలమండలి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలిస్తోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో కృష్ణా జలాలనే నగరం నలుమూలల్లో నున్న 8.64 లక్షల నల్లాలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నీటికి మార్గమధ్యలోని ఇబ్రహీంపట్నంలోనే గండికొడుతుండడంతో నగర శివారు ప్రాంతాలు తీవ్ర దాహార్తితో అలమటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృష్ణా జలాలకు భారీ డిమాండ్.. కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా మహానగరానికి ఏడాదికి 16.5 టీఎంసీల నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. అదీ శుద్ధిచేసిన నీటిని మాత్రమే. నల్లగొండజిల్లా కోదండాపూర్ నుంచి నగరశివార్లలోని సాహెబ్‌నగర్ వరకు సుమారు 110 కి.మీ.మార్గంలో కష్ణా మూడు దశల పైప్‌లైన్ వ్యవస్థలున్నాయి. మార్గమధ్యంలో సుమారు 30కి పైగా గ్రామాలున్నాయి. ఇబ్రహీంపట్నం తరహాలోనే ఆయా గ్రామాల వాసులు శుద్ధిచేసిన నీటితో తమ తమ గ్రామాల్లోని చెరువులను నింపాలన్న డిమాండ్లు లేవనెత్తితే నగర తాగునీటికి గండం తప్పదని నిపుణులు హెచ్చరిస్తుండడం గమనార్హం. -
ప్రత్యక్ష నరకం..
- ‘కృష్ణా’ పనులతో స్తంభిస్తున్న ట్రాఫిక్ - వాహనదారులకు ఇక్కట్లు.. - మంగళవారం మూడు ప్రమాదాలు చాంద్రాయణగుట్ట: చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాంతంలో కొనసాగుతున్న కృష్ణా మూడోదశ మంచినీటి పైప్‌లైన్ పనులతో వాహనదారులు తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఫ్లైఓవర్ కింది భాగంలో ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో చార్మినార్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాంద్రాయణగుట్ట చౌరస్తా మీదుగా దారి మళ్లిస్తున్నారు. చాంద్రాయణగుట్ట చౌరస్తా (బంగారు మైసమ్మ ఆలయ ప్రాంతం) నుంచి చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ రోడ్డు మీదుగా పహాడీషరీఫ్ వైపు వెళ్తున్నాయి. దీంతో ఈ రూట్లో ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయి వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపుతోంది. స్తంభించిన ట్రాఫిక్‌లో కొందరు వాహనదారుల తొందరపాటుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మూడు ప్రమాదాలు జరిగాయి. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. అదే విధంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా ప్రాంతంలో కాంక్రీట్ లారీ కారును ఢీకొట్టింది. ఉమర్ హోటల్ ప్రాంతంలో ర్యాష్‌గా వచ్చిన వాహనదారుడిని తప్పించే క్రమంలో లోడ్‌తో వెళ్తున్న లారీ పైప్‌లైన్ గోతిలో కూరుకుపోయింది. చాంద్రాయణగుట్ట చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వైపు వెళ్లే రూట్ కూడా మూసేసి కేవలం ఫ్లైఓవర్ నుంచి రాకపోకలు సాగించారు. శ్రీశైలం, కల్వకుర్తి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ రోడ్డు నుంచి వెళ్లనీయడంతో ఈ రోడ్డంతా రద్దీగా మారింది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట చౌరస్తా వాహనదారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. మంగళవారం దినమంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో వాహనదారులకు ప్రత్యక్ష నరకం కనిపించింది. కేశవగిరి నుంచి వచ్చే చిన్న వాహనాలను మాత్రమే ఫ్లైఓవర్ కింది నుంచి చార్మినార్, మిధాని వైపు రాకపోకలు సాగనిచ్చారు.