
కృష్ణ...కృష్ణా!
నగర తాగునీటి అవసరాలకు వినియోగించాల్సిన కృష్ణా జలాలను చెరువులోకి మళ్లిస్తున్నారు. నిపుణులు, అధికారుల సూచనలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజాప్రతినిధులు అనాలోచిత చర్యలకు పాల్పడుతున్నారు. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్‌కు తరలిస్తున్న ఒక మంచినీటి పైప్‌లైన్ కవర్‌ను తొలగించి, గత నాలుగు రోజులుగా స్థానిక ప్రజాప్రతినిధులే ఇబ్రహీంపట్నం చెరువులోకి కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. దీంతో నగర అవసరాలకు వినియోగించే నీటిలో భారీకోత పడే అవకాశాలున్నాయి.
- కృష్ణా జలాలకు ‘పట్నం’లో భారీ గండి
- శుద్ధిచేసిన జలాలతో ఇబ్రహీంపట్నం చెరువును నింపుతున్న వైనం..
- నగర తాగునీటి అవసరాలకు భారీగా కోత...
- అధికారుల సూచనలనూ బేఖాతరు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు?
సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి తరలిస్తున్న కృష్ణా జలాలకు భారీగా గండిపడింది. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్‌కు తరలిస్తున్న ఒక మంచినీటి పైప్‌లైన్‌కు అత్యవసర మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన కవర్‌ను కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు తొలగించారు. అక్కడే చిన్న కాల్వను ఏర్పాటు చేసి ఇబ్రహీంపట్నం చె రువులోకి కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు. దీంతో నగర తాగునీటి అవసరాలకు కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోదండాపూర్‌లో శుద్ధిచేసిన కృష్ణా జలాలతో సుమారు ఒక టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పట్నం చెరువులోకి నాలుగు రోజులుగా నీటిని వదులుతుండడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రతి వెయ్యి లీటర్ల కృష్ణా నీటిని రూ.30 ఖర్చుచేసి జలమండలి శుద్ధిచేస్తున్న విషయం విదితమే. ఈ విలువైన తాగునీటిని వృథాగా చెరువులోకి వదులుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిక్విడ్ క్లోరిన్ కలిసిన ఈ నీటిని పెద్ద మొత్తంలో చెరువులో నింపుతుండడంతో ఇబ్రహీం పట్నం చెరువు పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితం అవడంతోపాటు,చెరువులో చేపలు, జంతు, వృక్ష ఫ్లవకాలు మనుగడ సాగించడం కష్టసాధ్యమౌతుందని పర్యావరణవేత్తలు సైతం ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ శుద్ధిచేయని(రా వాటర్) కృష్ణా జలాలతో ఇబ్రహీంపట్నం చెరువును నింపుతామని ఇటీవల హామీ ఇచ్చినప్పటికీ..పట్నం చెరువులోకి కృష్ణా రా వాటర్‌ను తరలించేందుకు అవసరమైన పైప్‌లై న్లు, కాలువలు అందుబాటులో లేవు. ఇదే తరుణంలో స్థానిక ప్రజాప్రతినిధులు అత్యుత్సాహంతో నగరానికి తాగునీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌కున్న కవర్‌ను తొలగించి నాలుగురోజుల క్రితం చెరువులోకి మళ్లించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో జలమండలి అధికారులు చేసిన సలహాలు, సూచనలను సైతం సదరు ప్రజాప్రతినిధులు బేఖాతరు చేయడం గమనార్హం.
45 రోజుల నగర తాగునీటి అవసరాలకు కోత
సుమారు ఒక టీఎంసీ నీటిని 1200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువులోకి నింపిన పక్షంలో 45 రోజులపాటు నగర తాగునీటి అవసరాలకుసరిపడే తాగునీటిని కోల్పోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే కృష్ణా ఒకటి, రెండు, మూడవ దశల ద్వారా జలమండలి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలిస్తోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో కృష్ణా జలాలనే నగరం నలుమూలల్లో నున్న 8.64 లక్షల నల్లాలకు అరకొరగా సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నీటికి మార్గమధ్యలోని ఇబ్రహీంపట్నంలోనే గండికొడుతుండడంతో నగర శివారు ప్రాంతాలు తీవ్ర దాహార్తితో అలమటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కృష్ణా జలాలకు భారీ డిమాండ్..
కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా మహానగరానికి ఏడాదికి 16.5 టీఎంసీల నీటిని తరలించేందుకు అవకాశం ఉంది. అదీ శుద్ధిచేసిన నీటిని మాత్రమే. నల్లగొండజిల్లా కోదండాపూర్ నుంచి నగరశివార్లలోని సాహెబ్‌నగర్ వరకు సుమారు 110 కి.మీ.మార్గంలో కష్ణా మూడు దశల పైప్‌లైన్ వ్యవస్థలున్నాయి. మార్గమధ్యంలో సుమారు 30కి పైగా గ్రామాలున్నాయి. ఇబ్రహీంపట్నం తరహాలోనే ఆయా గ్రామాల వాసులు శుద్ధిచేసిన నీటితో తమ తమ గ్రామాల్లోని చెరువులను నింపాలన్న డిమాండ్లు లేవనెత్తితే నగర తాగునీటికి గండం తప్పదని నిపుణులు హెచ్చరిస్తుండడం గమనార్హం.