రేపిస్టును పట్టిచ్చిన ఏడేళ్ల బాలుడు
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఏడేళ్ల బాలుడి అద్భుతమైన జ్ఞాపకశక్తి పోలీసులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆరేళ్ళ పసిపాపపై అత్యాచారం చేసిన వ్యక్తిని పట్టివ్వడంలో కీలకమైన సమాచారాన్ని, నిందితుడికి సంబంధించిన స్పష్టమైన పోలికలను చెప్పి విజయ్ (పేరు మార్చారు) సీనియర్ అధికారుల ప్రశంసలందుకున్నాడు.
వివరాల్లోకి వెళితే బాధిత బాలికతో కలిసి విజయ్, అతని చెల్లెలు గత శుక్రవారం తిలక్ నగర్ ప్రాంతంలో ఒక పార్క్ లో ఆడుకుంటున్న సమయంలో జిషాన్(22) విజయ్‌ని అతని సోదరిని పక్కకు తీసుకెళ్లి రూ .10 ఇచ్చి మభ్యపెట్టి అక్కడినుంచి పంపేశాడు. అనంతరం ఆరేళ్ల చిన్నారిని ఒక ఏకాంతమైన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి క్లూ దొరకక ఇబ్బందిపడుతున్న పోలీసులకు విజయ్ సహాయపడ్డాడు. చివరికి ఆ బాలుడి సమాచారం ఆధారంగానే సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఏడేళ్ళ విజయ్ ఫొటోగ్రాఫిక్ మెమరీ పవర్ ను పోలీసులు ఇప్పుడు కొనియాడుతున్నారు. విజయ్ ఇచ్చిన సమాచారం మూలంగానే కేవలం 48 గంటల్లో నిందితుడిని పట్టుకోగలిగామని వారు తెలిపారు. స్పాట్‌కు తీసుకెళ్లడంతో పాటు, నిందితుడికి సంబంధించిన వివరాలను చాలా తెలివిగా, అద్భుతంగా అందించాడంటూ చెప్పారు. విజయ్ ను సన్మానించడంతోపాటు అతనికి సహకారాన్ని అందించాలని భావిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి దీపేంద్ర పాఠక్ చెప్పారు. నిందితుడిపై పోస్కో(POCSO) సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేశామన్నారు.
తిలక్ నగర్ లో సర్వోదయ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్న విజయ్ తండ్రి ఒక స్క్రాప్ కార్మికుడు. తండ్రికి నెలకు వచ్చే రూ. ఆరువేల ఆదాయమే అతని కుటుంబానికి ఆధారం. తన కొడుక్కి బాగా చదువుకోవాలనే కోరిక వుందని.. కానీ తమకు స్థోమత లేకున్నా అతని కల నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తల్లి చెప్పింది. .