అన్నదాతకు ‘అకాల’ కష్టాలు
ఏపీలో దెబ్బతిన్న పండ్ల తోటలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు రైతుల్ని ముంచేశాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానల వల్ల పలు జిల్లాల్లో బొప్పాయి, అరటి తోటలు ధ్వంసమయ్యాయి. పక్వానికొచ్చిన దశలో మామిడికాయలన్నీ నేలరాలాయి. కోతకొచ్చిన వరి... గాలివానకు మట్టిపాలైంది. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలింది. కోతకోసిన వరి ఓదెలు నీటిలో నానుతున్నాయి. గాలివానకు కళ్లాలు, పొలాల్లో తడిసిన ధాన్యాన్ని, వరి పంటను చూసి రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా పొలంలోనే ధాన్యం రాలిపోయింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో చెట్ల నిండా కాయలతో ఉన్న బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. గెలలు కోతకొస్తున్న దశలో ఉన్న అరటి తోటలన్నీ పడిపోయాయి. ఉల్లి పంట కొట్టుకుపోగా, జొన్న, వేరుశనగ తదితర పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాల ధాటికి 6,600 ఎకరాల్లో పండ్లతోటలు, 11,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న తదితర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
రైతన్న కన్నీరుమున్నీరు: అకాల వర్షాలు పంటల్ని దెబ్బతీయడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనంతపురం జిల్లాలోని 1,800 ఎకరాల్లో, కర్నూలు జిల్లాలో 3,000 ఎకరాల్లో మామిడి, ఉల్లి, అరటి, బొప్పాయి, చీనీ, బొప్పాయి తోటలు, వైఎస్సార్ కడప జిల్లాలోని అరటి, బొప్పాయి, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో 3,500 ఎకరాల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వరితోపాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.