అద్భుతాలు సాధించవచ్చు:చంద్రబాబు
హైదరాబాద్: భారతీయ మార్కెట్లకు జపాన్ పెట్టుబడులు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో స్మార్ట్ సిటీల నిర్మాణం, ఆధునిక వ్యవసాయం, సాంకేతిక అంశాలలో జపాన్ పెట్టుబడిదారుల సహకారాన్ని ఆయన కోరారు. మూడో రోజు జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు శాన్ నో స్టార్మ్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్లడ్ మేనేజ్మెంట్ విధానాలను పరిశీలించారు. అంతేకాకుండా, నకాటా వేస్ట్ మేనేజ్మెంట్ సైట్ను సందర్శించారు. 12 లక్షల జనాభా ఉన్న ప్యుకోకా నగరంలో ఘన వ్యర్ధాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు బాబుకు వివరించారు. నకాటా వేస్ట్ మేనేజ్మెంట్ విధానం పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీ కొత్త రాజధానిలో, 13 స్మార్ట్ సిటీలలో వేస్ట్ మేనేజ్మెంట్ను అమలు చేస్తామని ఆయన చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్లో జపాన్ అనుసరించిన విధానం ప్రపంచానికే ఆదర్శమని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని నిర్మాణంలో తాముకూడా పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్యుకోకా నగర డిప్యూటీ మేయర్ అత్సుహితో చెప్పారు.
**