మహిళా విహారం!
ట్రావెల్ గ్రూప్
అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కొత్త ప్రదేశాలు చుట్టిరావాలని, ప్రపంచ అద్భుతాలను కళ్లారా చూడాలని తపిస్తే... వయసుతో పనిలేకుండా వారితో అమ్మాయిలూ పోటీ పడితే.. నలభై మంది.. అంతా మహిళలే కలిసి ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంటే సాధ్యమయ్యే పనేనా? అంటే ‘సాధ్యమే’ అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు ‘ఫన్ ట్రావెల్ గ్రూప్’లోని మహిళలంతా! హైదరాబాద్‌కు చెందిన నలభై మంది మహిళలు పన్నెండేళ్లుగా కొత్త ప్రదేశాలు చూసి రావడానికి ఎంచుకున్న మార్గం ఇలా మీ ముందు...
చైనా, జపాన్, కాంబోడియా, టర్కీ, దక్షిణాఫ్రికా, రష్యా, అమెరికా... ఇలా ఇప్పటికే ప్రపంచపటంలోని 15 దేశాలను చుట్టొచ్చారు ఈ మహిళలంతా! ‘‘బాధ్యతలు అన్నీ తీరిపోయాయి. ఉన్న జీవితాన్ని ఆనందంగా మలచుకోవాలని కోరుకునేది ఈ వయసులోనే! కావల్సినంత తీరిక, కొత్త కొత్త ఆలోచనలు.. అన్నింటినీ పంచుకోవడానికి మాతో పాటు మరో ముప్పై మంది. లోకంలోని ఆనందాలను తనివితీరా చూసేందుకు ఒకరి నుంచి ఒకరం సిద్ధమై పోయాం. యేటి కేడాది ఈ సంఖ్య పెరుగు తూనే ఉంది. అభిరుచుల మేరకు, ఆరోగ్యాల తీరుకు ఒక్కోసారి తగ్గుతూ ఉంది.’’ అంటూ మొదలుపెట్టారు 80 ఏళ్ల వయసున్న శ్రీలతాదేవి.
ముందు పది మందే...
ఇల్లు, పిల్లలు, బాధ్యతలు.. వీటి నడుమే స్త్రీ జీవితం నడుస్తూ ఉంటుంది. ఇక దేశాలు చుట్టిరావడం అంటే అయ్యే పనికాదు. మరి వీరి వల్ల ఎలా సాధ్యమైంది? ఇదే విషయాన్ని ట్రావెల్ గ్రూప్ సభ్యులను అడిగితే- ‘‘ ఇప్పటి వరకు మా గ్రూప్‌కి ఒక పేరు అంటూ పెట్టుకోలేదు. కొత్త ప్రదేశాలను చూసొస్తే కొత్త శక్తి వస్తుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. స్త్రీల జీవితం అంటే ఎప్పుడూ ఇంటికే పరిమితమా? అని పన్నెండేళ్ల క్రితం పది మందితో మొదలుపెట్టాం’’ అంటూ తమ ప్రయాణ విశేషాలను వివరించడానికి ముందుకు వచ్చారు అనూరాధా రెడ్డి. హైదరాబాద్ ఇన్టాక్ కన్వీనర్‌గా ఉన్న అనూరాధారెడ్డి ఆసక్తితో మొదలుపెట్టిన ఈ లేడీస్ ట్రావెల్ ఇప్పుడు ప్రతియేటా కొత్త ఆనందాలను నింపుకోవడానికి సిద్ధపడుతోంది. అంతా బంధు, మిత్రులే! కొత్తగా పరిచయం అయినవారు తామూ వస్తామని ముందుకు వస్తున్నవారే! అలా ఇప్పటికి నలభై మంది అయ్యారు. అయితే వెళుతున్న ప్రాంతం, వారి వారి పరిస్థితులను బట్టి కొంతమంది డ్రాప్ అవుతుంటారు. కొంతమంది కొత్తవారు వచ్చి చేరుతుంటారు. అలా ఒక్కోసారి ట్రిప్‌కి పది మందే ఉండొచ్చు. కానీ ఏడాదికి ఒక దేశం అనే నియమం.. ముందే అంతా అనుకున్నాక నిర్ణయం అయిపోతుంది. ‘‘గెట్ టు గెదర్స్, వివాహ వేడుకలు, క్లబ్స్.. ఇలా ఏదో ప్లేస్‌లో అంతా కలుస్తూనే ఉంటాం. ఫోన్లు ఎలాగూ ఉన్నాయి.
మాలో ఒకరికి వచ్చిన ఆలోచన ముందు అనూరాధ దగ్గరకే వెళుతుంది. తనకైతే చారిత్రక ప్రదేశాల పట్ల, ప్రపంచ దేశాల గురించి ఒక అవగాహన ఉంది. అందుకే అక్కడి పరిస్థితులు, చూడదగిన ప్రదేశాలు అన్నీ వాకబు చేశాక మాకు మెయిల్స్ ద్వారా సందేశం వస్తుంది. వాటిని బట్టి ఆసక్తి గల వారు ముందుకువస్తారు’’ అని వివరించారు సాధన విదరే. ఈ మహిళలలో ఎక్కువ శాతం గృహిణులే! కొంతమంది ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన వారూ ఉన్నారు. కాలేజీ చదువులు చదువుకుంటున్న ఒకరిద్దరు అమ్మాయిలూ ఉన్నారు.
పక్కాగా ప్లానింగ్...
‘‘ట్రావెల్ టికెట్స్ ఇక్కడే కొనుగోలు చేస్తాం. వెళ్లబోయే చోట స్థానిక ట్రావెల్ ఏజెన్సీవారితో మాట్లాడం, అరేంజ్మెంట్స్ అన్నీ ముందుగా చేసుకుంటాం. అందుకే వెళ్లిన చోట సమస్యలేవీ ఎదురు కాలేదు’’ అంటారు వసంత జిన్నారెడ్డి. ‘‘దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం... అక్కడి వాతావరణానికి తగ్గట్టు ముందస్తు ప్రణాళిక ఉండాలి. దుస్తులతో పాటు స్వెటర్, శాలువా, గ్లౌజులతో అదనంగా తీసుకువెళతాం. ముందుగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌లు చేయించుకుంటాం. ఈ కాలంలో ముప్పై ఏళ్లు దాటుతూనే బి.పిలు, షుగర్లు సాధారణమై పోయాయి. అందుకని ఆ మందులు, డాక్టర్ ముందస్తుగా సూచించిన తలనొప్పి, కడుపునొప్పికి సంబంధించిన మందులు ప్యాక్ చేసుకుంటాం. దీంతో పాటు డాక్టర్ రాసిచ్చిన చీటీ కూడా వెంటే ఉంచుకుంటాం. ఒకసారి ‘పెరూ’ దేశం వెళ్లాం. ఆ దేశంలో మేం వెళ్లిన ఒక చారిత్రక ప్రదేశం సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఆ వాతావరణం సరిపడక కనీసం మాలో నలుగురు మహిళలు జబ్బు పడ్డారు. అదంతా అటవీ ప్రాంతం. ఒకే ఒక చిన్న క్లినిక్ ఉంది.
ఆ విషయం మాకు ముందుగానే తెలుసు. అందుకే మా జాగ్రత్తలో మేమున్నాం. కాబట్టి ఆ సమస్య నుంచి త్వరగానే బయటపడ్డాం’’ అన్నారు అనూరాధా రెడ్డి. ‘‘ఈ ఏడాది ఉజ్బెకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడ ఒక అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాం. అక్కడి విశేషాలు తెలుసుకుంటూ నడుస్తున్నాం. అందులో ఒకామె కిందపడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. చూస్తే ఒకే ఒక చిన్న క్లినిక్ ఉంది అక్కడ. అక్కడ చికిత్స తీసుకొని మేముండే చోటుకి వచ్చేసరికి అక్కడ డాక్టర్ రెడీగా ఉన్నాడు. మేం ఆశ్చర్యపోయాం. ఆ చిన్న క్లినిక్ నుంచి మా సమాచారం తెలుసుకొని, పట్టణంలో ఉన్న హోటల్వారికి తెలియజేసి, వెంటనే వైద్యసదుపాయం కల్పించారట. ఇలా ఏ దేశానికి వెళ్లినా అతిథుల (పర్యాటకులు)ను చాలా బాగా ఆదరించడం, ఎంతో గౌరవంగా చూడటం మేం చూశాం’’ అన్నారు మధ్యవయస్కురాలైన వసంత.
విలువైన వస్తువులు తక్కువ...
‘‘బర్మాలో అన్‌కట్ రూబీస్ విరివిగా లభిస్తాయి. ఇక్కడితో పోల్చితే ధర కూడా తక్కువ. కొంత మందిమి వాటిని కొని తెచ్చుకున్నాం. దాదాపుగా బంగారు, వజ్రాలు.. ఇలా విలువైన అలంకరణ వస్తువులను వెంట తీసుకెళ్లం. కొనుక్కురాము కూడా! తక్కువ లగేజీ, అదీ మాకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉండేలా చూసుకుంటాం. మా ప్రయాణ ఉద్దేశం ఏడాదిలో 10 నుంచి నెల రోజుల లోపు కొత్త కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఆనందించడం... అందుకే మాకు మేం ‘ఫన్గ్రూప్’గా పిలుచుకుంటాం’’ అంటూ తెలిపారు సప్తలవిద్రా.
వయసు తేడా లేని గ్రూప్...
మా గ్రూప్‌లో 16 నుంచి 80 ఏళ్ల వయసు వారి వరకు ఉన్నారు. ఇదే విషయం గురించి శ్రీలతా దేవి చెబుతూ ‘‘నా వయసు 80. మనమలు, మనమరాళ్లూ ఉన్నారు. కొత్త ప్రాంతాల్లో ఎలా ఉంటానో అని ఇంట్లో వారు కంగారు పడతారు. కానీ, కొత్త దేశంలో పదహారేళ్ల అమ్మాయి కూడా నాతో పోటీ పడలేదు. అంత వేగంగా నడుస్తాను’’ అన్నారు శ్రీలతాదేవి. ‘‘అక్కడి వాతావరణానికి మేమంత త్వరగా సర్దుబాటు కాలేం. కానీ శ్రీలతాదేవి హుషారును చూసి, మాకూ కొత్త శక్తి వచ్చినట్టనిపిస్తుంది. ఫొటోలు, పోజులు, రీసెర్చ్.. కొత్త కొత్త వంటకాల రుచులు.. అసలు అనుకున్న పది-పదిహేను రోజులు కొన్ని గంటల్లా గడచిపోతాయి. మా గ్రూప్ సభ్యులంతా ఎక్కడికెళ్లినా శాకాహారాన్నే తీసుకుంటాం. బయటి దేశాల్లో ఎక్కడ చూసినా మాంసాహారమే సులువుగా లభిస్తుంది. అయితే, మాంసాహారం లేకుండా ప్రత్యేకంగా తయారుచేయించుకోవచ్చు. పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వంటివి వెంట తీసుకెళతాం. బయటకు వెళ్లినప్పుడు ఆహారం విషయంలో కచ్చితమైన నియమాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తలెత్తవు’’ అని సలహా ఇచ్చారు సప్తలవిద్రా. ‘‘మేం వెళ్లిన వాటిలో ‘కివా’ ఒకటే ఎడారి ప్రాంతం. అక్కడ వాతావరణం ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం రకరకాలుగా మారుతుంటుంది. ఏ దేశానికెళ్లినా అక్కడి చారిత్రక కట్టడాలు, మాన్యుమెంట్స్ చుట్టూ గట్టి కంచె ఏర్పాటు చేసినవి చూశాం. భద్రత విషయంలో వారు మనకంటే చాలా ముందున్నారు’’ అని తమ అనుభవాలను వివరించారు ట్రావెల్ గ్రూప్ సభ్యులు.
అంతా మహిళలమే అయినా రక్షణ విషయంలో ఎక్కడా ఏ చిన్న తేడా రాలేదని వివరించిన ఈ ఫన్ ట్రావెల్ గ్రూప్ చిన్న చిన్న సమస్యలనూ అధిగమించిన తీరునూ వివరించింది. కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవడానికి వయసు తేడా లేకుండా ఆసక్తి కనబరిచే మహిళలకు వీరు ఓ మార్గం వేస్తున్నారనిపించింది.తెలుగు రాష్ట్రాలలో ఎన్నో అద్భుత ప్రాచీన కట్ట డాలు, సుందర సందర్శన స్థలాలు ఉన్నాయి. వాటి విశేషాలను మీరూ తెలియజేయాలనుకుంటే...
మా చిరునామా... విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1,
బంజారా హిల్స్, హైదరాబాద్ -34.
్ఛఝ్చజీ: sakshivihari@gmail.com