బ్యాంక్ షేర్లను భారీగా కొంటున్న ఫండ్స్
♦ మొండి బకాయిల ప్రక్షాళనకు ఆర్బీఐ, ప్రభుత్వం చర్యలు
♦ దీంతో బ్యాంక్ షేర్లవైపు మొగ్గుతున్న ఫండ్ మేనేజర్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ సంస్థలు బ్యాంక్ షేర్లలో జోరుగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థల బ్యాంక్ షేర్ల పెట్టుబడులు రికార్డ్ స్థాయికి, రూ.94,000 కోట్లకు పెరిగాయని వెల్త్ఫోర్స్డాట్కామ్ పేర్కొంది. మొండి బకాయిల ప్రక్షాళనకు ప్రభుత్వం, ఆర్బీఐలు గట్టి ప్రయత్నాలు చేస్తుండటమే దీనికి కారణమని ఈ సంస్థ వ్యవస్థాపకులు సిద్ధాంత్ జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు అందిస్తుండడం కూడా మరో కారణమని వివరించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు కేటాయింపులు పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మొండి బకాయిల సమస్యతోనే బ్యాంక్ షేర్లను ఫండ్స్ తగ్గించుకున్నాయన్నారు. సెబీ గణాంకాల ప్రకారం., మేలో మ్యూచువల్ ఫండ్ ఏయూఎమ్ల్లో 20.28 శాతంగా ఉన్న బ్యాంక్ షేర్లు జూన్ నాటికి 20.4 శాతానికి పెరిగాయని జైన్ తెలిపారు.