మున్సిపల్ ‘బతుకమ్మ’కు నిధులు లేవు
ఆదిలాబాద్ కల్చరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే.. ఇందుకు గాను మున్సిపాలిటీలకు నిధులు కేటాయించలేదు. దీంతో అక్కడి మహిళలు నిరాశకు గురయ్యారు. ఆదిలాబాద్లో 36 వార్డుల్లోని ప్రజలు బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు.
కాగా.. మున్సిపాలిటీలకు నిధులు కేటాయించకపోగా మున్సిపాలిటీల్లోని జనరల్ ఫండ్ నుంచి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నిధులు వినియోగింపులో కచ్చితమైన ఆదేశాలు, ఎంతవాడుకోవాలని.. ఎలా నిర్వహించాలో తెలియక మున్సిపాలిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.
మంత్రి జోగురామన్న, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీష, కలెక్టర్ జగన్మోహన్ హాజరుకానున్నారు. 1న సంజయ్నగరన్ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద, 2న క్రాంతినగర్లోని సాయిబాబా ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. నిధులు రాకపోగా జనరల్ ఫండ్ వాడుకునేందుకు మున్సిపాలిటి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో బతుకమ్మ సందడి కనిపించడం లేదు.