ఉడీ దాడిపై రంగంలోకి ఎన్ఐఏ
కేసు నమోదు..
ఉగ్రవాదులకు స్థానికుల సహకారంపై తేల్చనున్న దర్యాప్తు సంస్థ
జైళ్లలోని జైషే ఉగ్రవాదుల్ని ప్రశ్నించనున్న ఎన్ఐఏ
* విచారణ అనంతరం పాక్‌కు నేర నివేదిక సమర్పణ
* అశ్రునయనాల మధ్య అమరవీరుల అంత్యక్రియలు
శ్రీనగర్: ఉడీ ఉగ్రదాడిపై పూర్తిస్థాయి విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం రంగంలోకి దిగింది.
జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి కేసు విచారణ బాధ్యతను స్వీకరించింది. ఈ పాశవిక దాడిపై పోలీసులు ఆదివారమే కేసు నమోదు చేసి సంఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. ఆయుధాలు, మందుగుండుతో పాటు రెండు మొబైల్ సెట్లు, రెండు జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్) పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఉడీ చేరుకున్న ఎన్ఐఏ బృందం నలుగురు ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాల్ని సేకరించడంతో పాటు, వారి ఫొటోల్ని కూడా తీయనుంది. కశ్మీర్‌తో పాటు దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న జైషే తీవ్రవాదులకు ఆ ఫొటోలు చూపించి ఉగ్రవాదుల సమాచారాన్ని సేకరిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దరి మృతదేహాలు సగం కాలిపోయాయని సమాచారం. ఉడీ దాడిపై నేర నివేదిక రూపొందించిన అనంతరం ఉగ్రవాదుల్ని గుర్తించమంటూ పాకిస్తాన్‌ను ఎన్ఐఏ కోరనుంది. ఇప్పటికే ఉగ్రదాడిపై ఆర్మీ విచారణ మొదలుపెట్టింది.
వీర సైనికులకు కన్నీటి వీడ్కోలు
‘సందీప్ థోక్ అమర్ రహే, భారత్ మాతాకీ జై’ నినాదాలు, కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి వీడ్కోలు మధ్య ఉడీ దాడి అమరుడైన జవాన్ సందీప్ సోమ్‌నాథ్ థోక్(24) అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. మహారాష్ట్ర నాసిక్ జిల్లా ఖడంగ్లీ గ్రామంలో నిర్వహించిన ఈ అంత్యక్రియల్లో మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి దాదాజీ భూసే పాల్గొన్నారు. మరో జవాన్ వికాస్ జనార్ధన్ కుల్‌మెతేకు స్వగ్రామం పురాద్(యావత్మాల్ జిల్లా)లో వేలాది మంది తుది వీడ్కోలు పలికారు. చంద్రకాంత్ శంకర్ గలాండే(జాసి, సతారా), వికాస్ జన్రావ్(నంద్‌గావ్ ఖండేశ్వర్, అమరావతి)లకుతుది వీడ్కోలు పలికారు. జార్ఖండ్‌కు చెందిన నయమాన్ కుజర్(ఉరు, గుల్మా జిల్లా), జావ్రా ముండా(ఖుంతి జిల్లా)లకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
తండ్రికిచ్చిన మాట కోసం..ఒక వైపు తండ్రిని కోల్పోయిన బాధ... మరోవైపు తండ్రికిచ్చిన మాట..! ఉడీ దాడిలో అమరుడైన బిహార్ సైనికుడు ఎస్.విద్యార్థి ముగ్గురు కుమార్తెలు తండ్రి మాటకు కట్టుబడి కన్నీటిని దిగమింగుకుంటూ మంగళవారం పరీక్షలకు హాజరయ్యారు. ఆర్తి(8వ తరగతి, అన్షు(6వ తరగతి), అన్షికా(2వ తరగతి)లు యూనిఫాం ధరించి గయలోని స్కూల్లో పరీక్షలు రాశారు. తండ్రిని తలచుకుంటూ... కన్నీరు ఉబికివస్తున్నా పరీక్ష రాయడం అందరినీ కదిలించిందని స్కూలు ప్రిన్సిపాల్ చెప్పారు.
భారత్ మీడియాను అనుమతించని పాక్
న్యూయార్క్‌లో పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరీ ప్రెస్‌మీట్‌కు హాజరైన భారత మీడియాపై ఆ దేశ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఎన్డీటీవీ న్యూస్ చానల్ మహిళా ప్రతినిధిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ‘ఇస్ ఇండియన్ కో నికాలో’(ఈ భారతీయురాల్ని పంపించండి) అంటూ పరుషంగా మాట్లాడారు. ఐరాస సదస్సుకు హాజరైన పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ భారత విలేకరుల్ని తప్పించుకు తిరిగారు.
ఉడీ దాడిని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. పాకిస్తాన్‌పై ఉడీ తరహా దాడి చేయాలని బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే సింగ్ కోరారు. భారత్ కూడా అదే విధంగా స్పందించకుంటే పాకిస్తాన్ దాడుల్ని ఆపదని మంగళవారం ఆయన అన్నారు.
పాక్‌తో వాణిజ్యం నిలిపేస్తాం: ఐటీఏ
ప్రభుత్వం కోరితే పాకిస్తాన్‌తో వాణిజ్యం నిలిపివేసేందుకు సిద్ధమని భారత టీ అసోసియేషన్(ఐటీఏ) ప్రకటించింది. పాకిస్తాన్ ఏడాదికి 15 నుంచి 18 మిలియన్ల టీ పొడిని భారత్ నుంచి కొనుగోలు చేస్తోంది.