లోక్ సభకు మంత్రుల గైర్హాజరుపై క్షమాపణలు
న్యూఢిల్లీః ప్రశ్నోత్తరాల సమయంలో సంబంధిత మంత్రులు లేకపోవడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కే వచ్చి పడింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సహా ఆయన జూనియర్ మనోజ్ సిన్హా కూడ సమయానికి సభలో లేకపోవడం తీవ్ర వివాదం చెలరేగింది. దిగువ సభలో క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. ఇటువంటి సందర్భాలు పునరావృతం కాకూడదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడ హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి నెలకొంది.
మంగళవారం లోక సభ సమావేశంలో మంత్రుల గైర్హాజరుపై తీవ్ర గందరగోళం నెలకొంది. రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన 147 వ... 'గో ఇండియా స్మార్ట్ కార్డ్' ప్రశ్న వచ్చే సమయానికి మంత్రి సురేష్ ప్రభుగాని, సిన్హాగాని సభలో లేకపోవడం ఆందోళనకు దారి తీసింది. ఈ సందర్భం కాంగ్రెస్ కు కలసి వచ్చింది. సమయం చూసుకొని సభలో మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల లిస్టులో రైల్వేకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నపుడు ఆ శాఖ మంత్రి సభలో లేకపోవడంపై ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ పరిస్థితికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సంబంధిత ప్రశ్నల సమయంలో ఆయా శాఖల మంత్రులు లేకపోవడం ఇది మొదటిసారి కాదని, తప్పనిసరిగా మంత్రులు హాజరు కావాలని సూచించారు. సభా మర్యాదలను పాటించకుండా, మంత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం మంత్రుల గైర్హాజరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకవేళ కేబినెట్ మినిస్టర్ బిజీగా ఉంటే ఆ శాఖకు సంబంధించిన స్టేట్ మినిస్టర్లైనా తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, సమయానికి ఆయనకూడ సభలో లేకుండా పోయారని, ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తకూడదని ఆమె హెచ్చరించారు. అయితే ఈ విషయంపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు.. ఇటువంటి పరిస్థితి మరోసారి తలెత్తదని చెప్తూ... మంత్రి లేకపోవడంపై క్షమాపణలు తెలియజేశారు. సదరు రైల్వే మంత్రికి చెందిన ప్రశ్నను మరో రోజుకు వాయిదా వేయాల్సిందిగా కోరారు. దీంతో రైల్వే శాఖకు చెందిన ఆ ప్రశ్న తిరిగి బుధవారం ప్రశ్నోత్తరాల జాబితాలో ముందుగా పెట్టడంతో మనోజ్ సిన్హా జవాబు ఇచ్చారు. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడ సభలో ఉన్నారు. అనంతరం మంత్రి సురేష్ ప్రభు కూడ జరిగిన తప్పుకు క్షమాపణ తెలియజేశారు.