breaking news
Future City Hyderabad
-
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్‌కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్‌పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్‌దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్‌లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్‌గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్‌ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్‌గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్‌ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్‌లో ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రేవంత్‌రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్‌కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రోత్ కారిడార్లలో భూమి బంగారమే.. 3 రెట్లు పెరిగిన ధరలు
రేపటి అర్బన్ ఇండియా విజనే భారత్ ఫ్యూచర్ సిటీ. కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటకం, స్పోర్ట్స్, చలనచిత్ర నిర్మాణం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు ప్రత్యేకంగా జోన్లను కేటాయిస్తూ.. రేపటి తరాలకు పర్యావరణ హితమైన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే పదేళ్లలో సుమారు 10 లక్షల ఉద్యోగులు పనిచేయనున్న ఈ ఫోర్త్ సిటీలో ఈ మేరకు హౌసింగ్ డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు కొత్త మనోహర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు దక్షిణం వైపున 765 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనున్న ఈ సమగ్ర పట్టణ ప్రాంతం భారత్‌కే తలమానికంగా నిలుస్తుందని తెలిపారు. –సాక్షి, సిటీబ్యూరోఇప్పటికే ఫేజ్–1లో 14 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 30 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో రహదారుల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. పనుల ప్రారంభమైతే ఆయా ప్రాంతాల్లోని భూమి బంగారంగా మారుతుంది. వచ్చే రెండేళ్లలో ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాలలో భూముల ధరలు మూడు రెట్లు పెరగడం ఖాయం. మీర్ఖాన్పేట, ముచ్చర్ల, గుమ్మడవల్లి, లేమూరు, యాచారం, కందుకూరు, నందివనపర్తి, కడ్తాల్, ఆమన్‌గల్ ప్రాంతాల్లో అభివృద్ధి జోరుగా ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ఎకరం రూ.2–5 కోట్లు ఉండగా.. వచ్చే రెండేళ్లలో రూ.10–15 కోట్లకు చేరుతుంది.గ్రోత్ కారిడార్‌లో బంగారమే.. ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితమైంది. కానీ, రీజినల్ రింగ్ రోడ్డు, దాని చుట్టూ రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌లతో సగం తెలంగాణ ప్రాంతం అభివృద్ధి నెక్ట్స్ లెవల్‌కు చేరుతుంది. ఇప్పటికే ఆయా కీలక ప్రాజెక్ట్‌లపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఔటర్‌కు ఇరువైపులా గ్రోత్ కారిడార్ కిలో మీటర వరకే కేటాయించారు. దీంతో మల్టీ పర్పస్ జోన్‌గా మారిన ఆ ప్రాంతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు, భారీ గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు వచ్చాయి. ఇక, ఇరువైపులా 5 కి.మీ. వరకూ గ్రోత్ కారిడార్‌గా పరిగణించనున్న ట్రిబుల్ ఆర్ ప్రాంతంలో అభివృద్ధి ఇంతకు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. ఈ కారిడార్లలో ఎక్కడ భూమి కొన్నా బంగారంగా మారడం ఖాయం.శంషాబాద్ మెయిన్ సిటీ.. బేగంపేట విమానాశ్రయం ప్రారంభించిన తొలినాళ్లలో హైదరాబాద్‌కు శివారు ప్రాంతమది. కానీ, ఇప్పుడు సిటీకి మెయిన్ సెంటర్‌గా అభివృద్ధి చెందింది. ఇదే తరహాలో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డుల అభివృద్ధితో సమీప భవిష్యత్తులో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కూడా ప్రధాన నగరంగా మారుతుంది. ఫోర్త్ సిటీ నుంచి శంషాబాద్‌కు 20 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గమంతా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. హైటెక్ సిటీలతో ఐటీ కంపెనీల రాకతో గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ఎలాగైతే అభివృద్ధి చెందాయో అంతకు రెట్టింపు వేగంతో మహేశ్వరం అభివృద్ధి చెందుతుంది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎయిరో స్పేస్ కంపెనీల రాకతో రావిర్యాల, ఆదిభట్ల, మహేశ్వరం ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. బెంగళూరు హైవే, ఫ్యూచర్ సిటీలతో అనుసంధానమై ఉండటం అదనపు అంశాలు.అనుమతులు వేగం.. గత ప్రభుత్వంలో ఎలాగైతే టీఎస్–బీపాస్ ద్వారా 21 రోజుల్లోనే పారిశ్రామిక పెట్టుబడులు, సంస్థలకు అనుమతులు ఇచ్చారో.. అదే తరహాలో హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు టైం లైన్ పెట్టి అనుమతులను ఇవ్వాలి. దీంతో ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు బిల్డర్లు ముందుకు రావడంతో పాటు పన్నులు, ఫీజుల రూపంలో ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరుతుంది. కొత్త మనోహర్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ నిపుణులు -
రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుంటోంది..
రాష్ట్రాభివృద్ధి కసం ప్రభుత్వం చేసే పనులు, అవలంభించే విధానాలు ప్రజలకు తెలిస్తేనే మరింత సక్సెస్ అవుతాయి. రాబోయే తరాల భవిష్యత్తును మార్చేసే అలాంటి కీలక ప్రాజెక్ట్‌లకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైటెక్ సిటీ, ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్‌లతో సుమారు మూడు దశాబ్దాలుగా రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారిపోయిందో అంతకు రెట్టింపు స్థాయిలో మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్లతో తెలంగాణ దశదిశలు మారిపోతాయి. ఎయిర్‌పోర్ట్‌తో హైదరాబాద్ నుంచి ప్రపంచం మొత్తానికి తలుపు తెరిచినట్టే.. ఔటర్తో తెలంగాణ మొత్తానికి కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడిదే స్థాయిలో ప్రపంచ దేశాలను ఆకర్షించే ఈ మూడు గేమ్ చేంజర్ ప్రాజెక్ట్‌లు రాష్ట్రాభివృద్ధిని మార్చనున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) తెలంగాణ ప్రెసిడెంట్ కే.ఇంద్రసేనారెడ్డి అన్నారు. – సాక్షి, సిటీబ్యూరోవరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు వంటి హనీమూన్ పీరియడ్ ముగిసింది. దీంతో స్థిరాస్తి రంగం మళ్లీ పుంజుకుంటోంది. 18 నెలల్లో నగరంలో 2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడమే ఇందుకు ఉదాహరణ. వంద చ.అ.కు ఒక జాబ్ చొప్పున 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. దీంతో గృహాలకు డిమాండ్ ఏర్పడింది. పాత ప్రభుత్వాలు కేవలం పశ్చిమ హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాతబస్తీలో మెట్రో విస్తరణ, దక్షిణ హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్.. ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధి ప్రణాళికలు చేస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, ఓఆర్ఆర్– ట్రిపుల్ ఆర్ మధ్య కొత్త ప్రాంతాలలో భూములు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార అవకాశాలూ పెరుగుతాయి. రోడ్లను వెడల్పు చేస్తే కార్ల సంఖ్య పెరగడమే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మెట్రో విస్తరణ దూరాలు దగ్గరవుతాయి. ప్రజా రవాణా పెంచితేనే సిటీ అభివృద్ధి, దూరం పెరుగుతుంది. దీంతో కస్టమర్లు ఎక్కడికక్కడ ఇళ్లు కొనుగోలు చేయవచ్చు.హైడ్రా లాగే రెరా.. ప్రస్తుతం దేశంలో సుమారు 1.10 లక్షల మంది బిల్డర్లు ఉన్నారు. నిర్మాణ రంగంలో అసంఘటిత బిజినెస్ ఎక్కువగా ఉంటుంది. నకిలీ బిల్డర్లు, మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, తక్కువ ధరకు వస్తుందనే ఆశతో వారి చేతిలో కస్టమర్లు మోసపోతున్నారు. గృహ కొనుగోలుదారులకు భరోసా, వారి పెట్టుబడులకు భద్రత కల్పించే పదునైనా అస్త్రం రెరా. దీన్ని గత ప్రభుత్వం విస్మరించింది. దీంతో ప్రీలాంచ్, సాఫ్ట్లాంచ్ల పేరుతో అమాయక కస్టమర్ల కష్టార్జితాన్ని కాజేశారు. కస్టమర్లు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అనుమతులు లేకుండా, రూపాయి పన్ను చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నకిలీ బిల్డర్లను హైడ్రా తరహాలో కఠినంగా వ్యవహరించాలి. ఈమేరకు రెరాను మరింత బలోపేతం చేయాలి.ఏటా లక్ష కార్మికులకు నైపుణ్య శిక్షణ.. దేశీయ నిర్మాణ రంగంలో వచ్చే పదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్య కార్మికులు అవసరం. ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది కార్మికులు తెలంగాణ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది నైపుణ్య కార్మికులు నెలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తున్నారు. కొడంగల్, నిజామాబాద్, పరిగి, కరీంనగర్, వరంగల్ వంటి మన తెలంగాణ నుంచి యువత ముంబై, ఎన్సీఆర్–ఢిల్లీ, దుబాయ్, గల్ఫ్ వంటి దేశాలకు వలస వెళ్తున్నారు. నెలకు రూ.25–రూ.30 వేలకు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారు వెయ్యి ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఆయా విద్యా సంస్థలు అకడమిక్ స్థాయిలో బాగానే ఉన్నా ఆన్సైట్ ప్రాక్టికల్ శిక్షణలో వెనుకబడి ఉన్నాయి. 12 తరగతిలోపు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు 180 రోజుల పాటు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. 90 రోజుల పాటు క్లాస్రూమ్ శిక్షణ, 90 రోజులు ఆన్సైట్ ట్రెయినింగ్ ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే జరగనున్న క్రెడాయ్ స్టేట్‌కాన్ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించనున్నాం.త్వరలోనే ఫ్యూచర్ సిటీ చాప్టర్..ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 15 చాప్టర్లు, వెయ్యి మంది సభ్యులు ఉన్నారు. వీటిని 25 చాప్టర్లకు విస్తరించాలన్నది లక్ష్యం. త్వరలోనే ఫ్యూచర్ సిటీ క్రెడాయ్ చాప్టర్‌ను ప్రారంభించనున్నాం. కనీసం ఒక్క ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) పొందిన, నాణ్యమైన 30 మంది సభ్యులతో ఈ చాప్టర్‌ను తెరవనున్నాం. కోడ్ ఆఫ్ కండక్ట్ విధిగా పాటించే సభ్యులతో ఆ తర్వాత సంగారెడ్డి, జహీరాబాబాద్ చాప్టర్లు కూడా రానున్నాయి. ప్రభుత్వం, బిల్డర్లకు మధ్య క్రెడాయ్ వారధిలా పనిచేస్తుంది. ప్రభుత్వ పాలసీలు, పన్నులు తదితరాలపై బిల్డర్లకు అవగాహన కల్పిస్తుంది. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.