futuristic
-
2043లో ఒక వానాకాలం
అదేమిటో...వర్షాకాలం రాగానే రోడ్లు మాట తప్పకుండా చెరువులు అవుతాయి. బైక్లేమో ‘నేనేమైనా బోట్ అనుకున్నావా’ అంటూ ముందుకు వెళ్లడానికి మొరాయిస్తాయి. వర్షాకాలంలో రోడ్లు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రైటర్, డిజిటల్ క్రియేటర్ ప్రతీక్ అరోరా ఫ్యూచరిస్టిక్ రెయిన్వేర్, రోడ్ల చెరువులపైనా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా దూసుకుపోయే అత్యాధునిక ఆటోల ఏఐ ఇమేజ్‌లను సృష్టించి ‘ఇవి నిజమైతే ఎంత బాగుంటుంది!’ అనిపించాడు. సైన్స్–ఫిక్షన్, హారర్ ఎలిమెంట్స్‌ను ఏఐకి జోడించి ‘ఔరా’ అనిపిస్తున్నాడు ప్రతీక్. ‘వానకాలంలో ముంబై రోడ్లు హారర్ సినిమాల్లా భయపెడతాయి. టెక్నాలజీతో కూడిన ప్రత్యేక దుస్తులు, ప్రత్యేక వాహనాలు ఉంటే తప్ప బయటికి రాలేని పరిస్థితి ఉంది. మీ ఇమేజ్‌లు నిజం కావాలి’ అంటూ నెటిజనులు స్పందించారు. -
Sheybarah Resort: భూతల స్వర్గం!
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న రిసార్ట్ హోటల్. సౌదీ ప్రధాన భూభాగానికి ఆవల షాబారా దీవిలో తయారవుతోంది. ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సంస్థ ‘షాబారా రిసార్ట్’ పేరుతో నిర్మిస్తున్న ఈ హోటల్ వచ్చే ఏడాది నుంచి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటల్‌ను నిర్మిస్తున్న దీవిలోని పరిసరాలు, హోటల్లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా దీనిని భూతల స్వర్గంగానే భావిస్తారని డెవలపర్స్ సంస్థ చెబుతోంది. అంతేకాదు, ఇది ‘మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’ అని ఊదరగొడుతోంది కూడా! షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని అధునాతన హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. షాబారా దీవి తీరానికి చేరువలోని రంగురంగుల పగడపు దిబ్బలు కూడా ఇక్కడి నుంచి చూసే అతిథులకు కనువిందు చేస్తాయి. ఈ హోటల్లో 260 మంది సిబ్బంది సేవలందిస్తారు. ఇది ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి కల్పించనుంది. జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఈ హోటల్‌ను తీర్చిదిద్దుతున్నామని ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సీఈవో జాన్ పగానో చెబుతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం చేటు కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్తును ఉపయోగించుకునేలా దీనిని నిర్మిస్తున్నామని, ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
స్కూటర్.. సూపర్..
ఇది భవిష్యత్ తరం స్కూటర్ డిజైన్. పేరు ఎక్స్‌క్యూ. బ్రెజిల్‌కు చెందిన రికార్డో సిల్వా దీన్ని డిజైన్ చేశారు. ఎక్స్‌క్యూ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ స్కూటర్ బాడీని సౌర ఫలకాలతో రూపొందించారు. ఇవి చక్రాల్లో ఉండే ఇంజిన్‌కు విద్యుత్‌ను అందిస్తాయి. అదే సమయంలో మామూలుగా చార్జింగ్ చేసుకునే సదుపాయమూ ఉంది. సౌర ఫలకాలు ఉత్పత్తి చేసే విద్యుత్‌తో ఫోన్, లాప్టాప్ వంటి వాటిని కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ స్కూటర్ హ్యాండిల్ వద్ద కెమెరాలు ఉంటాయి. దీని వల్ల వెనక వస్తున్న వాహనాలు వంటి వాటి వివరాలు కెమెరాలకు అనుసంధానించి ఉండే స్మార్ట్ ఫోన్ తెరపై ప్రదర్శితమవుతాయి. మన స్కూటర్ల తరహాలోనే లోపల లగేజీ పెట్టుకునే సదుపాయమూ ఉంది. స్కూటర్ బరువు కూడా తక్కువ. ఇందులో ఉండే ‘ఆఫ్’ మోడ్ ప్రెస్ చేస్తే.. హ్యాండిల్, సీటు లోపలకు వెళ్లిపోతాయి. దీంతో ఎంచక్కా ఈ స్కూటర్‌ను బస్సులో లేదా ట్రైన్లో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చని చెబుతున్నారు.