ఈ ఫొటోలో కనిపిస్తున్నది సౌదీ అరేబియాలో నిర్మితమవుతున్న రిసార్ట్ హోటల్. సౌదీ ప్రధాన భూభాగానికి ఆవల షాబారా దీవిలో తయారవుతోంది. ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సంస్థ ‘షాబారా రిసార్ట్’ పేరుతో నిర్మిస్తున్న ఈ హోటల్ వచ్చే ఏడాది నుంచి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ హోటల్‌ను నిర్మిస్తున్న దీవిలోని పరిసరాలు, హోటల్‌లోని సౌకర్యాలు చూస్తే ఎవరైనా దీనిని భూతల స్వర్గంగానే భావిస్తారని డెవలపర్స్ సంస్థ చెబుతోంది.
అంతేకాదు, ఇది ‘మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’ అని ఊదరగొడుతోంది కూడా! షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని అధునాతన హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మిస్తున్నారు. షాబారా దీవి తీరానికి చేరువలోని రంగురంగుల పగడపు దిబ్బలు కూడా ఇక్కడి నుంచి చూసే అతిథులకు కనువిందు చేస్తాయి. ఈ హోటల్‌లో 260 మంది సిబ్బంది సేవలందిస్తారు.
ఇది ఏకకాలంలో 140 మంది అతిథులకు వసతి కల్పించనుంది. జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఈ హోటల్‌ను తీర్చిదిద్దుతున్నామని ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్’ సీఈవో జాన్ పగానో చెబుతున్నారు. పర్యావరణానికి ఏమాత్రం చేటు కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్తును ఉపయోగించుకునేలా దీనిని నిర్మిస్తున్నామని, ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment