పీజీ వైద్య ఫీజులపై పునరాలోచించాలి
బీజేఎల్పీనేత జి.కిషన్రెడ్డి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని బీజేఎల్పీనేత జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీకి వీలుకల్పించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని దుయ్యబట్టారు. ఫీజుల పెంపుపై కేంద్ర వైద్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ భారీగా పెంచిన ఫీజుల వల్ల పేద వర్గాలకు చెందిన వారెవరూ పీజీ విద్యను చదివే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు.
వైద్య పీజీ కోర్సులు చదివేందుకు విద్యార్థులకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వనంత స్థాయిలో ఈ ఫీజులను పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు సరిగా లేవని, ప్రమాణాలను పాటిం చడం లేదని ఎంసీఐ చెబుతుండగా, ఇటువంటి నాసిరకం కాలేజీలకు భారీగా ఫీజు లను పెంచే వీలు కల్పించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అనుకూల మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, మిత్రపక్షం ఎంఐఎం మెడికల్ కాలేజీకి లబ్ధి జరి గేలా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, చంద్రబాబు ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.