విద్యుత్ సమస్యపై స్పందించకుంటే జరిమానా
సుల్తానాబాద్(కరీంనగర్): ట్రాన్స్కో అధికారులు సమస్య పరిష్కరించని సందర్భాల్లో తమ దృష్టికి తెస్తే విచారించి పరిహారం అందేలా చూస్తామని కన్జూమర్ గ్రీవెన్సెస్ రిడ్రసల్ ఫోరం చైర్పర్సన్ జి.రాజారాం తెలిపారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ట్రాన్స్కో కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 448 వినియోగదారులు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయగా 174 సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. మొత్తం 11 కేసులకుగాను రూ.29వేలను వినియోగదారులకు సంస్థ నుంచి పరిహారంగా అందించినట్లు చెప్పారు. ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించకుంటే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. నేరుగా రాలేకపోతే కార్యాలయం సమయంలో ఫోన్ నంబర్ 08702461551కు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.