G. ravi kumar
-
ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు సిద్ధం
- రాష్ట్రవ్యాప్తంగా 436 పెండింగ్ పోస్టులను భర్తీచేయాలి - ఉన్న ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం - విలేకర్ల సమావేశంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఒంగోలు టూటౌన్: రాష్ట్రంలో ట్రెజరీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రెండు నెలల్లో పరిష్కరించకపోతే ఆందోళనలకు వెనుకాడేదిలేదని ట్రెజరీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికుమార్ హెచ్చరించారు. సంంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనటానికి జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ర్టంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రెజరీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా నేటికీ చర్యలు తీసుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్రమొత్తం మీద అన్ని జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 436 పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న ఉద్యోగులకు పనిభారం ఎక్కువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఒక్కొక్క ట్రెజరీ కార్యాలయంలో 14 అటెండర్ పోస్టులకుగాను కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజ్‌కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పార్ట్‌టైం మసాల్జీలు(చిన్న ఉద్యోగులు)అతితక్కువ వేతనంతో పనిచేస్తూ ఆర్ధిక ఇబ్బందులు పడుతుంటే నేటికీ కనీస వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రోజుకి రూ.300 ఇవ్వాలని చట్టం చెబుతున్నా దానిని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహధ్యక్షులు గురుమూర్తి, ఉపాధ్యక్షుడు టీవీ రవీంద్ర, రాష్ట్ర కోశాధికారి హరికుమార్, వెస్ట్ గోదావరి అధ్యక్షుడు డి.కృష్టంరాజు, ప్రకాశం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కె అహ్మద్, కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మూడు ఈఎస్ఐ వైద్యశాలల ఏర్పాటు
మార్కాపురం(ప్రకాశం జిల్లా): త్వరలో రాష్ట్రంలో ఈఎస్ఐ వైద్యశాలలను విజయనగరం, గుంటూరు, కాకినాడల్లో ఏర్పాటు చేస్తున్నామని ఈఎస్ఐ వైద్యశాలల జాయింట్ డైరెక్టర్ జి.రవికుమార్ తెలిపారు. స్థానిక ఈఎస్ఐ వైద్యశాలను మంగళవారం తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విజయనగరంలో 200 పడకలు, కాకినాడ, గుంటూరుల్లో వంద పడకల వైద్యశాలలు కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో 75 ఈఎస్ఐ వైద్యశాలలున్నాయని, వీటిల్లో 50 వైద్యశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులు స్థలాలు కేటాయిస్తే వెంటనే భవనాలు నిర్మించుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో డయాగ్నోసిస్ సెంటర్లు ఉన్నాయని, 10 పడకలు మాత్రమే ఇక్కడ ఉంటాయన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో 10 మంది సభ్యులకు గాను ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారని తెలిపారు.