జి.వెంకటస్వామి మృతికి.. రాష్ట్రపతి సంతాపం
కుటుంబసభ్యులకు లేఖ ద్వారా పరామర్శ
సంతాపం తెలిపిన వివిధ పార్టీలు, పలువురు నాయకులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి మృతికి రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు కాకా కుమారుడు జి.వివేకానంద్‌కు రాష్ట్రపతి ఒక లేఖ రాశారు. ‘వెంకటస్వామి మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. సీనియర్ కాంగ్రెస్ నేత అయిన వెంకటస్వామి సీనియర్ పార్లమెంటేరియన్. ఈ జాతికి అనేక హోదాల్లో సేవ చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.
సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన ఒక ప్రముఖ నాయకుడిని మనం కోల్పోయాం. మీ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ మీడియాతో మాట్లాడుతూ ‘దళిత నాయకుడిగానే కాకుండా సమాజంలోని తాడిత, పీడిత వర్గాల అభ్యున్నతి కోసం కాకా నిలబడ్డారు’ అని పేర్కొన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన నేత అని కొనియాడారు.
ఏపీ అసెంబ్లీ, మండలి సంతాపం
సాక్షి, హైదరాబాద్: కాకా మృతికి ఏపీ శాసనసభ, మండలి సంతాపం తెలిపాయి. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మంగళవారం సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే చైర్మన్ చక్రపాణి కాకా మృతి విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా నివాళి
సీనియర్ కాంగ్రెస్‌నేత జి, వెంకటస్వామి మృతిపై సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా నివాళుల ర్పించాయి. కాంగ్రెస్ పార్టీలో మామూలు కార్యకర్తగా జీవితం ప్రారంభించిన వ్యక్తి చివరకు సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఎదిగారని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కాకా ఆధ్వర్యంలో జాతీయస్థాయి గుడిసెవాసుల సంఘం ఏర్పడిందని, ఆయన మృతి బడుగువర్గాల ప్రజలకు తీరని లోటన్నారు. వెంకటస్వామి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, కార్మిక సంఘాల ఏర్పాటుకు ఆరు దశాబ్దాల పాటు అవిరళ కృషి చేశారని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నిర్మోహమాటంగా వ్యక్తంచేశారని, మాటకు కట్టుబడి నిక్కచ్చిగా వ్యవహరించారని పేర్కొన్నారు. పేద, అణగారిన వర్గాల భాగస్వామ్యాన్ని పెంచి సంప్రదాయ రాజకీయాన్ని ప్రజాస్వామీకరించే క్రమానికి వెంకటస్వామి దోహదం చేశారని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ మరో ప్రకటనలో పేర్కొన్నారు.