ప్రభుత్వం స్పందించకపోతే రాజీనామా చేస్తాం
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : చాలాకాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ చౌకధరల దుకాణదారుల సంఘాల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు జి.వెంకటేష్‌గౌడ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైఎంవీఏ హాలులో ఆదివారం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేషన్ షాపుల నిర్వహణను ప్రభుత్వమే భరించి, ప్రతి డీలర్‌కు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనం ఇవ్వలేకపోతే క్వింటాల్‌కు ప్రస్తుతం ఇస్తున్న రూ.20 కమీషన్‌ను రూ.80కి పెంచాలని అన్నారు. ఈ-పాస్‌లో లోపాల కారణంగా డీలర్లు ఇబ్బంది పడుతున్నారని, లబ్ధిదారులు నష్టపోతున్నారని వివరించారు.
ఈ-పాస్ సమస్యలతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 600 మంది డీలర్లు రాజీనామా చేశారని, తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుంటే మిగిలిన 30 వేల మందిమీ కూడా రాజీనామా చేస్తామని వెంకటేష్‌గౌడ్ హెచ్చరించారు. మార్చిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విజయవాడ లేదా గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, డీలర్లను చైతన్యపరచి, రాజీనామాలకు సిద్ధమవుతామన్నారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.గిరిజారావు, రాష్ట్ర కోశాధికారి టీఏవీవీఎల్ నరసింహమూర్తి, కాటం రజనీకాంత్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డీలర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.