gaayaalu
-
భర్త దాడిలో గాయపడిన మహిళ మృతి
చెన్నారావుపేట : భర్త చేతిలో దెబ్బలు తిని తీవ్రగాయాలపాలైన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని అక్కల్చెడ శివారు లచ్చినాయక్ తండాలో శుక్రవారం జరిగింది. ఎస్సై జగదీష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాలోతు చంద్రు చిన్న కుమారుడు రవికి కొత్తగూడెం మండలం ఓటాయి తండాకు చెందిన భూక్య జామ్‌ల–పాక్రిల కూతురు రమ(32)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వారి సంసార జీవితంలో కుమార్తెలు అశ్విని, మధుమతి, కుమారుడు నవీ¯ŒS జన్మించారు. సోమవారం రవి తన భార్యను అదనపు కట్నం తేవాలని కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు కాగా నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. రమ మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతురాలి తండ్రి జామ్‌ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
మంగపేట : మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్పల్ప గాయాలయ్యాయి. పొదుమూరుకు చెందిన కోలా ఉదయ్, కొప్పుల నవీన్, గగ్గూరి నగేష్‌లు మంగపేట సమీపంలోని ముక్కిడి పోచమ్మ ఆలయానికి వెళ్లి స్వగ్రామానికి బైక్‌పై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి భద్రాచలానికి వెళ్తున్న కారును గమనించకుండా.. రోడ్డు దాటేందుకు యత్నించారు. అయితే కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు.కాగా, ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో స్టాఫ్ నర్సులే వీరికి చికిత్స అందించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుడుందెబ్బ మండల అధ్యక్షుడు అల్లెం నర్సింహారావు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.