నగరంలో షటిల్ సందడి
సాక్షి, హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో కొత్తదనానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఇప్పుడు నగర అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. గత కొన్నేళ్లుగా అనేక మంది అంతర్జాతీయస్థాయి ఆటగాళ్లను అందించి షటిల్ క్రీడకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో తొలి సారి లీగ్ మ్యాచ్‌లు జరగనుండటం ఆసక్తి రేపుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమ, మంగళ, బుధవారాల్లో మూడు ‘టై’లు జరుగుతాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌తో పుణే పిస్టన్స్, మంగళవారం బంగా బీట్స్‌తో హైదరాబాద్ హాట్‌షాట్స్ తలపడతాయి. బుధవారం తొలి సెమీ ఫైనల్ నిర్వహిస్తారు.
సొంతగడ్డపై...
టోర్నీలో సెమీఫైనల్ స్థానం కోసం పోటీ పడుతున్న అవధ్ వారియర్స్, పుణే పిస్టన్స్‌ను ఎదుర్కోనుంది. నగరానికి చెందిన తాజా సంచలనం పీవీ సింధు వారియర్స్‌ను నడిపిస్తోంది. లీగ్‌లో తొలిసారి సొంతగడ్డపై ఆమె మ్యాచ్ ఆడనుంది. ఈ జట్టులోనే ఏపీకి చెందిన శ్రీకాంత్, గురుసాయిదత్ కూడా సొంత ప్రేక్షకుల మధ్య సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో 2 గెలిచి 2 ఓడిన అవధ్, ఇందులో నెగ్గితే సెమీస్ చేరుకుంటుంది. మరో వైపు 3 మ్యాచ్‌లు నెగ్గిన పుణే ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అశ్విని పొన్నప్ప, యుగెన్ మిన్, షెంక్, అనూప్ శ్రీధర్ లతో పటిష్టంగా కనిపిస్తోన్న పిస్టన్స్ మరో మ్యాచ్ నెగ్గాలని పట్టుదలగా ఉంది.