చెప్పిందొకటి.. చేస్తున్నదొకటి
పెనుకొండ రూరల్ : ఎన్నికల సమయంలో రైతు, డ్వాక్రా, చేనేతల రుణమాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని..ఇలా అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారంటూ ప్రజలు మండిపడ్డారు. పెనుకొండ మండలం సుద్దబట్లపల్లి, సత్తారుపల్లి గ్రామాల్లో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకూ తిరిగి టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు ఏ విధంగా ఉందో తెలపాలని కోరారు.
రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఉద్యోగాల భర్తీ ఊసే లేదని, నిరుద్యోగభృతీ ఎవరికీ అందలేదని, సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని ప్రజలు దుమ్మెత్తి పోశారు. ఆనాడు చెప్పిందొకటి.. నేడు చేస్తున్నదొకటి అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నయవంచక నేతను తామెన్నడూ చూడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.