కాలిబాటలతో ప్రయోజనం
గడ్డిపల్లి (గరిడేపల్లి) : పొలాల్లో కాలిబాటల ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని లయోలా కళాశాలకు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తెలిపారు. శుక్రవారం మండలంలోని గడ్డిపల్లిలో రైతు మల్లిఖార్జున్ పంట పొలంలో కాలిబాటలపై కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. నాట్లు వేసే సమయంలో ఎన్ని ఎక్కువ మొక్కలు నాటితే అంత దిగుబడి వస్తుందని రైతులు భావించడం సరికాదన్నారు. వరిసాగులో మొక్కల సాంద్రత చాలా కీలకమైందని, మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి చీడపీడలు వ్యాపిస్తాయన్నారు. కాలిబాటలను తీసుకోవడం వల్ల దోమ పోటును నివారించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కరిష్మా, సింధు, నిషిత, తేజస్వీ, బిందు పాల్గొన్నారు.