షోపియాన్‌లో కొనసాగుతోన్న కర్ప్యూ
శాంతిభద్రతల దృష్ట్యా షోపియాన్, కుల్గం, జమ్మూ కాశ్మీర్‌లోని పలు పట్టణాల్లో విధించిన నిరవధిక కర్ప్యూను నేడు కూడా కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. అయితే షోపియన్ పట్టణంలో అందోళనలు అదుపులోకి వచ్చాయన్నారు. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రంలో కర్ప్యూను పాక్షికంగా సడలిస్తామన్నారు.
బుధవారం గగరన్ ప్రాంతంలోని సీఆర్పీఎప్ శిబిరం వద్ద జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. ఆ ఘటనను జమ్మూ కాశ్మీర్‌లోని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ జిలానీ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనకు నిరసనగా శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన అనంతరం నిరసన తెలపాలని ఆయన ముస్లిం మతస్థులకు పిలుపునిచ్చారు.
అలాగే గగరన్ ఘటనకు నిరసనగా జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధ్యక్షుడు మహ్మమద్ యాసిన్ మాలిక్ శుక్రవారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
ఇప్పటికే జమ్ముకాశ్మీర్‌లో గగరన్ ప్రాంతంలో ఈ నెల 7, 11 తేదీల్లో జరిగిన కాల్పుల ఘటనపై ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే గగరన్లోని సీఆర్పీఎఫ్ శిబిరాన్ని మరోక చోటుకు తరలించాలని అబ్దుల్లా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.