జనం మనసు దోచిన గజదొంగ
ఒక తల్లి... ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే అనుకోకుండా అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. ఒకరు చెడు మార్గంలో, మరొకరు మంచి మార్గంలో వెళుతుంటారు. విలన్ వల్ల అన్నదమ్ములిద్దరూ కలుస్తారు. అతని ఆట కట్టిస్తారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి విలన్‌పై పగ తీర్చుకుంటారు. ఇదో బ్రహ్మాండమైన బాక్సాఫీస్ ఫార్ములా! కొన్ని వందల చిత్రాలను విజయతీరాలకు చేర్చిన ఫార్ములా!! ఎన్టీఆర్ అనేకసార్లు చేసిన ఆ తరహా కమర్షియల్ ద్విపాత్రాభినయ కథలకు 1980లలో మళ్ళీ ఒక రకంగా బాక్సాఫీస్ శుభారంభం – ‘గజదొంగ’. అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు కొల్లగొట్టిన ఆ ‘గజదొంగ’కు ఈ జనవరి 30తో నలభై ఏళ్ళు నిండాయి.
నాలుగు దశాబ్దాల పైచిలుకు క్రితం... ఎన్టీఆర్ డేట్లున్నా, ఆయనతో సినిమా అన్నా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వ్యవహారం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి సినీ నిర్మాతలు, టెక్నీషియన్లకు చిత్ర నిర్మాణానికి డేట్లిచ్చి, నిలదొక్కుకొనేలా చూసేవారు ఎన్టీఆర్. అందుకే, అప్పట్లో అందరూ ఆయనతో సినిమా తీసేందుకు ఉత్సాహపడేవారు.
ఆ ముగ్గురు నిర్మాతల ముచ్చట
సినీరంగంలో మొదటి నుంచి ఎన్టీఆర్ ప్రోత్సాహం అందుకున్న నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ అప్పటికి చాలా రోజులుగా ఆయనతో సినిమా తీయాలని ఉత్సాహపడుతున్నారు. అంతకు ముందే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘కేడీ నంబర్ 1’ (1978) చిత్రం హక్కులను కోస్తా ఆంధ్రా మొత్తానికీ నిర్మాత చలసాని గోపి, నటుడు కైకాల కొన్నారు. అది వంద రోజులాడి, లాభాలు తెచ్చింది. శతదినోత్సవ ప్రకటనలోనూ వారు ఎన్టీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలూ చెప్పారు. హిట్ కాంబినేషనైన కైకాల, చలసాని కలిసి, సినిమా తీసేలా ఆ పైన ఎన్టీఆర్ డేట్లిచ్చారు. అయితే, ఆర్థికంగా దెబ్బతిన్న ఒకప్పటి నిర్మాత జి. వెంకటరత్నాన్ని కూడా సహ నిర్మాతగా పెట్టుకొని, సినిమా తీయమన్నారు. అలా వచ్చిందే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వసూళ్ళ వర్షం కురిపించిన, కమర్షియల్ హిట్ – ‘గజదొంగ’.
సోషల్ దుర్యోధనుడు... జేమ్స్‌బాండ్ మ్యూజిక్...
1980 జూలై 20న మద్రాసు ఏ.వి.ఎం. స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైన ‘గజదొంగ’లో అన్నదమ్ములుగా ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ చేశారు. సినిమా కథ ప్రధానంగా బంగారం దొంగిలించే గోల్డ్‌మ్యాన్ పాత్ర అయిన అన్నయ్య చుట్టూ తిరుగుతుంది. హీరో గజదొంగగా ఎందుకు మారాడు, అచ్చం అతనిలా ఉండే తమ్ముడి కథేమిటి, విడిపోయిన ఆ ఇద్దరూ ఎలా కలిశారు, విలన్ ఆట ఎలా కట్టించారనేది కథ. ప్రేమించిన అమ్మాయి నుంచి విడిపోయిన భగ్నప్రేమికుడైన గోల్డ్‌మ్యాన్ పాత్ర నడక, నడత – అన్నీ పౌరాణికాల్లో దుర్యోధనుడిని తలపిస్తుంది. దుర్యోధనుడి క్యారెక్టరైజేషన్‌ను దృష్టిలో పెట్టుకొని, దాన్ని సోషలైజ్ చేసి, తీశారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. సత్యానంద్ రచన, ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ ముందు ముగ్గురు ఎన్టీఆర్లలో అసలైన గోల్డ్‌మ్యాన్‌ను కనిపెట్టే సీన్ లాంటివి థ్రిల్లింగ్‌గా ఉంటాయి.
‘గజదొంగ’ అనే టైటిల్‌కు తగ్గట్టే సంగీత దర్శకుడు చక్రవర్తి ఇంగ్లీషు జేమ్స్‌బాండ్ చిత్రాల స్ఫూర్తితో, ఈ చిత్రానికి రీరికార్డింగ్ చేశారు. ఆ శైలి నేపథ్య సంగీతం, ఛేజింగులు జనాన్ని ఆకట్టుకున్నాయి. కథలో గోల్డ్‌మ్యాన్ దగ్గర బ్లాకీ అనే ఓ నల్ల పెంపుడు పిల్లి, కుక్క, మాట్లాడే బొమ్మ ఉంటాయి. మూడూ ఆకర్షణీయ అంశాలయ్యాయి. బంగారం దొంగిలించే టైటిల్ పాత్రకు తగ్గట్టే కళా దర్శకుడు భాస్కరరాజు వేసిన బంగారం తాపడం చేసినట్టుగా అనిపించే గోల్డెన్ డెన్ సెట్, గద్ద బొమ్మలతో రాజాసనం లాంటివి బాగుంటాయి. అప్పటికే ఎన్టీఆర్‌కు స్పెషలిస్ట్ కాస్ట్యూమర్‌గా పాపులరైన విజయవాడ ‘యాక్స్ టైలర్స్’ వాలేశ్వరరావు డిజైన్ చేసిన బెల్ బాటమ్ ప్యాంట్లు, చొక్కాలు, గోల్డ్‌మ్యాన్ వేసుకొనే బంగారు అంచు సూటు, బూటు ఆకట్టుకున్నాయి.
విరిగిన చేతితోనే... షూటింగ్!
‘గజదొంగ’ టైములోనే ‘సర్దార్ పాపా రాయుడు’ షూటింగ్లో బుల్లెట్ మీద నుంచి పడి, ఎన్టీఆర్ కుడి చేయి ఫ్రాక్చరైంది. కానీ, విశ్రాంతి తీసుకుంటే డేట్లు వృథా అయి, నిర్మాతలు ఇబ్బంది పడతారని ఆలోచించి, వాళ్ళ క్షేమం కోసం చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ ‘గజదొంగ’ పాటలు, క్లైమాక్స్‌లో పాల్గొన్నారు. ‘అల్ల నేరేడు చెట్టుకాడ’, ‘చుప్పనాతిచందురుడు’, ‘ఒక రాతిరి ఒక పోకిరి’ పాటలు మూడింటిలోనూ సలీమ్ మాస్టర్ నృత్యసారథ్యంలో, ఎడమ చేతితోనే డ్యా¯Œ ్స మూవ్మెంట్లు ఇస్తూ, విషయం కనపడనివ్వకుండా కవర్ చేశారు.
కోటి రూపాయల గ్రాస్!
‘గజదొంగ’ అని టైటిల్ పెట్టినా, ఎన్టీఆర్‌కూ, స్పెషల్ సి.ఐ.డి పాత్రధారి సత్యనారాయణకీ మధ్య ఒక్కటే ఫైట్ ఉంటుంది. మిగతా సినిమా ఛేజింగుల మీదే నడుస్తుంది. దీనిపై ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి వినిపించడంతో, రిలీజైన 50 రోజుల తరువాత సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో ఫైటర్లతో ఎన్టీఆర్ చేసే కారుషెడ్డు ఫైట్‌ను కొత్తగా కలిపారు. ఈ చిత్రం రూ. కోటి గ్రాస్ కలెక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్ళ గజదొంగగా నిలిచింది.
తెలుగు సినీచరిత్రలో అలా కోటి రూపాయల గ్రాస్ వచ్చిన 10వ సినిమా ఇది. వాటిలో ఎన్టీఆర్‌కు ఇది 9వ సినిమా. అంటే, అప్పటికి ఒక్క ‘శంకరాభరణం’ మినహా, ‘లవకుశ’ మొదలుకొని కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మిగతా తొమ్మిది తెలుగు చిత్రాలూ ఎన్టీఆర్వే అన్న మాట! తరువాతి కాలంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి ఇండస్ట్రీ హిట్లు తీసిన దర్శకుడు బి. గోపాల్ ‘గజదొంగ’కి రాఘవేంద్రరావు వద్ద సహాయ దర్శకుడిగా పనిచేయడం విశేషం.
ఫస్ట్ వీక్ ఇండస్ట్రీ రికార్డ్
‘గజదొంగ’కు ఎన్టీఆర్ పారితోషికం రూ. 17 లక్షలు. పారితోషికంతో కలిపి, ఆ రోజుల్లో రూ. 35 లక్షల లోపే సినిమా నిర్మాణం అయిపోయింది. ఒకటి, రెండు ఏరియాలు మాత్రం నిర్మాతలు ఉంచుకొని, అన్ని ఏరియాలూ దాదాపు రూ. 50 లక్షల పైచిలుకుకు అమ్మేశారు. సినిమా కమర్షియల్‌గా హిట్టయి, బయ్యర్లకూ లాభాలు తెచ్చింది. 45 ప్రింట్లతో రిలీజైన ‘గజదొంగ’ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే (బెంగళూరు, వగైరా ఏరియాలు కలపకుండానే) మొదటి వారం రూ. 34 లక్షలకు పైగా వసూలు చేసి, అప్పటి ఇండస్ట్రీ రికార్డును దాటేసింది. అంతకు ముందు ‘ఛాలెంజ్ రాముడు’ (బెంగుళూరుతో కలిపి రూ. 31 లక్షలు), ‘సర్దార్ పాపారాయుడు’ (ఓన్లీ ఏ.పి. రూ. 29 లక్షలు) తొలి వారం వసూళ్ళలో ఇండస్ట్రీ రికార్డులు. ఆ రెంటినీ అధిగమించిన ‘గజదొంగ’ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు కొల్లగొట్టింది. పాతిక సెంటర్లలో 50 రోజులు ఆడింది. వైజాగ్, గుంటూరు కేంద్రాల్లో డైరెక్టుగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరుల్లో సింగిల్ షిఫ్టుతో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో ‘గజదొంగ’ శతదినోత్సవం చేసుకుంది. అలాగే, బెజవాడ, వైజాగుల్లో షిఫ్టింగులతో రజతోత్సవం జరుపుకొంది.
నిజానికి, సహ నిర్మాత వెంకటరత్నానికి మొదట్లోనే రూ. 2–3 లక్షల మొత్తం ఇచ్చేసి వదిలించుకొని, సినిమా మొత్తం తామే నిర్మించాలని మిగిలిన ఇద్దరు నిర్మాతలూ భావించారు. కానీ, వెంకటరత్నం మాత్రం అలా వద్దంటూ, నిర్మాణంలో 20 పైసల వాటా ఉంచుకున్నారు. ఆ నిర్ణయమే ఆయనకు లాభించింది. తొలి రిలీజుతో పాటు, మలి విడతలో మరో రెండు రిలీజులకు కూడా సినిమా బాగా లాభాలు తెచ్చింది. అలా వెంకట రత్నానికి వచ్చిన మొత్తం మొదట్లో ఇవ్వజూపిన రూ. 2 –3 లక్షల కన్నా చాలా ఎక్కువే. ఇక, మూడో రిలీజు సమయానికి నిర్మాత కైకాల నాగేశ్వరరావు (సత్యనారాయణ తమ్ముడు) మిగతా ఇద్దరు నిర్మాతల వాటాడబ్బులు లెక్కకట్టి చెల్లించేసి, సినిమా పూర్తి హక్కులు పొందారు.
ఫ్యాన్స్ అడిగినా... ఎన్టీఆర్ నో!
ఫస్ట్ రిలీజ్లో బెజవాడలో ఈ చిత్రాన్ని ఏకంగా 4 హాళ్ళ (అప్సర, శేష్‌మహల్, పటమట రామకష్ణా, గుణదల రామ్‌గోపాల్)లో వేశారు. కలెక్షన్స్ బాగా వచ్చినప్పటికీ, విజయవాడలో మెయిన్ థియేటరైన అప్సరలో ‘గజదొంగ’ 84 రోజులే ఆడింది. అది తీసేసి, హీరో కృష్ణంరాజు ‘పులిబిడ్డ’ (1981 ఏప్రిల్ 24న) రిలీజ్ చేశారు. ‘గజదొంగ’ను హాలులో నుంచి తీసేసే సమయంలో ఎన్టీఆర్ విజయవాడలో ఉన్నారు. బెజవాడ కనకదుర్గ గుడి కొండ మీద ‘అనురాగ దేవత’ చిత్రంలోని ‘ముగ్గురమ్మల గన్నా ముద్దుల మాయమ్మ...’ అనే పాట ఎన్టీఆర్, జయసుధలపై చిత్రీకరిస్తున్నారు.
అప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్ళి, ‘గజదొంగ’ పంపిణీదారులైన ‘లక్ష్మీ ఫిలిమ్స్’ వారిని కలసి, అప్సర థియేటర్లో 100 రోజుల దాకా తమ హీరో సినిమా కొనసాగించాలని కోరారు. ‘లక్ష్మీ ఫిలిమ్స్’ లింగమూర్తికి ఎన్టీఆర్‌తో ఫోన్ చేయిస్తే, ఫలితం ఉంటుందని పంపిణీ వర్గాల నుంచి ఫ్యాన్స్‌కు సలహా వచ్చింది. దాంతో, ఫ్యాన్స్ వెళ్ళి, ‘అనురాగ దేవత’ షూటింగులో ఎన్టీఆర్‌ను కలిశారు. ఆ జనవరిలో రిలీజైన ‘‘ఇతర చిత్రాల వంద రోజుల వసూళ్ళ కన్నా, 50 రోజులకే ఎక్కువ కలెక్షన్లు తెచ్చిన ‘గజదొంగ’ను 84 రోజులకే ఎత్తేస్తున్నార’’ని ఫిర్యాదు చేస్తూ, డిస్ట్రిబ్యూటర్‌కు ఫోన్ చేయాలంటూ అభ్యర్థించారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం డిస్ట్రిబ్యూటర్లకున్న ఆబ్లిగేషన్లను గ్రహించాలంటూ సముదాయించారు. ‘‘మన సినిమాను మరో రెండు వారాలు ఆడితే కొత్తగా వచ్చే ఘనత లేదు, ఆడకపోతే పోయేదీ లేదు. ఆల్రెడీ మనకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చాయి కదా’’ అంటూ అభిమానులను అనునయించారు. వీరాభిమానులు అడిగినా సరే, ‘గజదొంగ’ను 100 రోజులు ఆడించేందుకు ఎన్టీఆర్ తన పలుకుబడిని వాడకపోవడం అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
రిపీట్ రన్స్ లోనూ...
గమ్మత్తేమిటంటే ఆ తర్వాత 1983లో, ’87లో, 1990లో– ఈ 3 రిపీట్ రన్స్ లోనూ ‘గజదొంగ’ మళ్ళీ రెగ్యులర్ షోలతో ఏకంగా యాభయ్యేసి రోజుల చొప్పున ఆడింది. చెప్పాలంటే ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ కన్నా ‘గజదొంగ’ రిపీట్ రన్స్‌లో ఎక్కువ మొత్తం వసూలు చేస్తూ వచ్చింది. ‘‘1990లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు 13 నెలల కాలానికి రెండున్నర లక్షలు పెట్టి ‘గజదొంగ’ రైట్స్ కొన్నాం. చిరంజీవి ‘కొండవీటి దొంగ’ రిలీజ్ టైమ్‌లో 1990 మార్చి 9న గుంటూరులో ‘గజదొంగ’ రిపీట్ రన్ వేశాం. ఒక వారం ఆలస్యంగా విజయవాడలోనూ రిలీజ్ చేశాం. సినిమా 50 రోజులు ఆడింది. ఆరున్నర లక్షలు వ్యాపారం చేసి, మా పెట్టుబడి, ఖర్చులు వెనక్కి రావడమే కాక అప్పట్లోనే రూ. 2 లక్షల లాభం మిగిలింది’’ అని గుంటూరు శ్రీలలితా ఫిలిమ్స్ పంపిణీదారు, పలు చిత్రాల కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. వెరసి, కథ, కథనం మొదలు పబ్లిసిటీ దాకా ‘గజదొంగ’ అనుసరించిన మాస్ కమర్షియల్ పంథా ఆ తరువాత కొత్త తరానికి కూడా బాక్సాఫీస్ రాచబాట అయింది.
10 వారాలు... ముగ్గురు హీరోలు.. మూడు హిట్స్!
‘గజదొంగ’లో గోల్డ్ మ్యాన్ సరసన జయసుధ, తమ్ముడి పాత్ర సరసన శ్రీదేవి నటించారు. ఆ ఏడాది శ్రీదేవి, జయసుధ కలసి నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్. శ్రీదేవి ఇంకా పూర్తిగా ఫైల్లోకి రాక ముందు వారిద్దరూ కలసి శోభన్ బాబు ‘బంగారు చెల్లెలు’, అక్కినేని ‘ముద్దుల కొడుకు’ (1979) లాంటి చిత్రాల్లో చేశారు. కాకపోతే, ఒక పాత్ర పోయాక రెండో పాత్ర వస్తుంది. కానీ, ఇద్దరికీ సమప్రాధాన్యం ఉండేలా వారు చేసిన చిత్రాలు – 1981లో ఎన్టీఆర్ ‘గజదొంగ’, ఏయన్నార్ ‘ప్రేమాభిషేకం’, శోభన్‌బాబు ‘ఇల్లాలు’. కేవలం 10 వారాల వ్యవధిలోనే ఆ నాటి పెద్ద హీరోలు ముగ్గురితోనూ ఆ హీరోయిన్లిద్దరూ కలసి మూడు సినిమాలు చేయడం, ఆ మూడూ ఆ ఏడాది అతి పెద్ద హిట్లు కావడం ఓ విశేషం.
శ్రీదేవి, జయసుధ
అరవై ఏళ్ళ హీరోతో... ‘హాట్’ పాట!
నిజజీవితంలో అరవయ్యేళ్ళ వయసుకు దగ్గరలో ఉన్న ఎన్టీఆర్ కూ, 17 ఏళ్ళ టీనేజర్ శ్రీదేవికీ మధ్య ‘గజదొంగ’లో ‘ఇదో రకం దాహం...’ అంటూ తెరపై పూర్తి హాట్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించడం విచిత్రం. రాత్రి ఏ పొద్దుపోయాకో చూడదగ్గ ఈ పాటను ఆ రోజుల్లో, ఆ వయసు ఎన్టీఆర్ మీద తీయడం, జనాన్ని ఒప్పించడం కష్టమే. రాఘవేంద్రరావు చేయదలచిన ఆ రిస్క్‌కు ఎన్టీఆర్ ఓకే అన్నారు. యూనిట్టేమో భయపడి, రిలీజ్ ముందైనా పాట తీసేయాల్సి వస్తుందని సందేహించారు.
కానీ, చివరకు ఆ రిస్కీ పాట జనంలోకి వెళ్ళి, ఆమోదం పొందడం విశేషం. డ్యుయట్లు సైతం మాస్ మెచ్చే ధోరణిలో చేసే ఎన్టీఆర్, ఈ అతి శంగార గీతానికి రిస్కును అర్థం చేసుకొని, లలితంగా నటించి మెప్పించారని దర్శకుడు రాఘవేంద్రరావే ఓ సందర్భంలో వివరించారు. మొత్తానికి, అలా రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ చేసిన రిస్కు ఫలించింది. ఇక, ఈ సినిమాలోనే జయసుధపై వచ్చే ‘ఇంద్రధనుసు చీరగట్టి..’, భగ్నప్రేమికుడిగా ఎన్టీఆర్ ఆవేశంగా పాడే ‘రెండక్షరాల ప్రేమ...’ పాటలూ ఆ రోజుల్లో పదే పదే వినిపించేవి.
ఆల్‌టైమ్ జయమాలిని హిట్!
‘గజదొంగ’లోని 7 పాటలూ 7 రకాలుగా, ఒకదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. వేటూరి రాసిన ఈ పాటలన్నీ కమర్షి యల్ హిట్. ముఖ్యంగా, ఎన్టీఆర్ గోల్డ్‌మ్యాన్ పాత్రకూ, శృంగార తార జయమాలినికీ మధ్య వచ్చే ‘నీ ఇల్లు బంగారం కానూ’ పాట అతి పెద్ద హిట్. జయమాలిని ఆల్‌టైమ్ హిట్స్‌లో అగ్రస్థానంలో నిలిచే ఆ పాట సినిమాకు ప్లస్ అయింది. ఇప్పటికీ తరచూ వినిపిస్తూ, యూ ట్యూబ్‌లోనూ జయమాలిని పాటల్లో ఎక్కువ వ్యూస్ ఉండే పాటగా ఇదే ట్రెండింగ్! గమ్మత్తేమిటంటే, కొన్నేళ్ళ క్రితం టీవీ యాంకర్ ఉదయభాను చేసిన ‘నీ ఇల్లు బంగారం కానూ’ లాంటి టీవీ షోలు ఆ పాటనూ, సినిమానూ జనం నోట నిలిచేలా చేశాయి.
అప్పట్లో ఆ పాటలో జయమాలిని ధరించిన కాస్ట్యూమ్ చాలా ఫేమస్. రాఘవేంద్రరావు తెలుగు హిట్ ‘దేవత’ (1982)ను హిందీలో ‘తోఫా’ (1984)గా రీమేక్ చేసినప్పుడు, హీరోయిన్ శ్రీదేవికి సైతం అదే రకం డ్రెస్ వేయడం మరో విశేషం.
ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్
‘గజదొంగ’ ఫస్ట్ రిలీజ్ టైమ్‌లో చెన్నైలోని ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గమ్మత్తుగా పబ్లిసిటీ చేశారు. అంతకు కొద్ది నెలల ముందు కమలహాసన్ నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘గురు’ (1980) వచ్చింది. అందులో కమలహాసన్ త్రీడీ కళ్ళద్దాల లాంటివి పెట్టుకోవడం, వజ్రాలు పొదిగిన గద్ద బొమ్మ దొంగతనం లాంటి సీన్లతో ఓ స్టిల్ ఉండేది. ‘గురు’కు కూడా తానే పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహించిన ఈశ్వర్ ఆ స్టిల్ స్ఫూర్తితో, ఎన్టీఆర్ ‘గజదొంగ’కు ఫ్లోరసెంట్ కలర్స్‌తో హైలైట్ అయ్యేలా వాల్ పోస్టర్లు డిజైన్ చేశారు. విజయవాడ నేషనల్ లితో ప్రింటర్స్‌లో బ్లాక్ అండ్ వైట్‌లో ఆ ‘30 బై 40’ సైజు పోస్టర్లను ప్రింట్ చేసేవారు. దాని మీద అక్కడి మరో పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ పి.ఎ. రంగా ఫ్లోరసెంట్ ఎఫెక్ట్ వేసేవారు. చీకటిలో సైతం మెరిసే ఆ ఫ్లోరసెంట్ వాల్ పోస్టర్లను స్తంభాలకు అంటించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్. ఆ ఫ్లోరసెంట్ పోస్టర్ల ట్రెండ్ తరువాత ఇంకా ఊపందుకొని, కొన్నేళ్ళపాటు చాలా సినిమాలు ఆ పబ్లిసిటీ పద్ధతిని అనుసరించాయి.
– రెంటాల జయదేవ